Site icon HashtagU Telugu

Ex Gratia: బస్సు ప్రమాద ఘటనపై సీఎం ‘జగన్’ దిగ్భ్రాంతి… మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటన..

Chittoor Accident

Chittoor Accident

ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి సమీపంలో భాకరాపేట వద్ద ప్రయివేటు బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు.

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొన్నారని సీఎంకు వివరించారు. తిరుపతిలో స్థానిక ఆస్పత్రులు స్విమ్స్, రుయా, బర్డ్‌ ఆస్పత్రుల్లో వీరికి చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, అలాగే గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు. అంతేకాకుండా క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. బాధితులు కోలుకునేంతవరకూ అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.