AP : ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ విధానాల ధ్యేయంగా ఉండాలని, దానికి దార్శనికత, ప్రకృతి పరిరక్షణ, సాంకేతిక వినియోగం ప్రధాన ఆధారాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రజలు, విజన్, నేచర్, టెక్నాలజీ అనే నాలుగు అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పాలన సాగిస్తేనే అత్యుత్తమ ఫలితాలు సాధించగలమని ఆయన తెలిపారు. సోమవారం సచివాలయంలో రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ), కీ పనితీరు సూచికలు (కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్)పై ప్రణాళికా శాఖతో కలిసి నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. ప్రజలే కేంద్ర బిందువు. పాలనలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలు ఏర్పరచాలి. భవిష్యత్ విజన్‌తో ముందుకు సాగాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు.
అలాగే పర్యావరణానికి హాని కలగకుండా పరిరక్షించే విధంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని సమర్థవంతంగా వినియోగిస్తూ, పారదర్శకత, వేగం, సామర్ధ్యాన్ని పెంపొందించాలి. ఈ నాలుగు మూల సూత్రాలను సమన్వయం చేస్తే పాలన అద్భుత ఫలితాలవైపు దారితీస్తుంది అని సీఎం పేర్కొన్నారు. ఆగస్టు 15 నుండి 700 రకాల ప్రభుత్వ సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఇది ప్రజలకు వేగవంతమైన సేవలను చేరవేయడంలో కీలకం అవుతుందని పేర్కొన్నారు. టెక్నాలజీ వినియోగంతో పారదర్శకతను పెంచాలని సూచించారు.
2029 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 5.42 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఇది రూ. 3,47,871గా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతీ శాఖ తమ పనితీరును కొలవడానికి నిర్దిష్ట ఇండికేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కేంద్ర స్థాయిలోని నీతి ఆయోగ్ మాదిరిగా రాష్ట్ర ప్రణాళికా శాఖ అన్ని విభాగాలను ముందుకు నడిపించాలని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయం, మైనింగ్ వంటి రంగాల్లో విలువ జోడింపు (వాల్యూ ఎడిషన్)పై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రస్తుతం ఉద్యానవన పంటల ద్వారా రూ. 1.26 లక్షల కోట్లు, ఆక్వా ద్వారా రూ. 1.12 లక్షల కోట్ల జీవీఏ వసూలవుతోందని అధికారులు సీఎంకు వివరించారు.
కేవలం 60 లక్షల జనాభాతో, పరిమిత వనరులతో ఉన్న ఆ దేశం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మరి మనం 140 కోట్ల జనాభాతో, అపార వనరులతో ఎందుకు సాధించలేము? అని ప్రశ్నించారు. ఆర్టీజీఎస్ (Real-Time Governance) ద్వారా వచ్చే సమాచారాన్ని ఏకీకృతంగా విశ్లేషించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజల అవసరాలను ముందుగా అంచనా వేసి సేవల ను సమర్థంగా అందించవచ్చని చెప్పారు. ప్రభుత్వ శాఖలు ప్రతీ త్రైమాసికానికి పనితీరును సమీక్షించుకోవాలని సూచించారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకొని వారి ఆరోగ్యం, ఆదాయం వంటి అంశాలను డేటాబేస్‌లో నమోదు చేసి, ప్రభుత్వ పథకాలతో పాటు వారి ఆదాయాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో మంత్రి పయ్యావుల కేశవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.