Mars: అంగారక గ్రహం మీద జీవం ఆనవాళ్లు… షాకింగ్ విషయాలు వెల్లడి!

మనుషులకు భూమి ఏమాత్రం ఆవాసయోగ్యంగా ఉండబోదనే భవిష్యత్ దృష్టితో.. ఇతర గ్రహాల మీద వాతావరణం

  • Written By:
  • Updated On - October 11, 2022 / 05:44 PM IST

మనుషులకు భూమి ఏమాత్రం ఆవాసయోగ్యంగా ఉండబోదనే భవిష్యత్ దృష్టితో.. ఇతర గ్రహాల మీద వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. భూమికి సమీపంలోని అంగారక గ్రహం మీద చాలా సంవత్సరాలుగా ప్రయోగాలు జరుగుతుండగా.. అనేక ఉపగ్రహాలు అక్కడ పరిశోధనల్లో మునిగిపోయి ఉన్నాయి. అవి చేస్తున్న పరిశోధనల్లో తాజాగా ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.

ఎరుపు గ్రహంగా పిలిచే అంగారక గ్రహం ఒకప్పుడు ఇలా ఉండేది కాదని పరిశోధకులు భావిస్తున్నారు. 4 బిలియన్ సంవత్సరాల క్రితం అక్కడ వాతావరణం చాలా భిన్నంగా ఉండేదని ‘నేచర్ ఆస్ట్రానమి’ లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడైంది. అక్కడ ఒకప్పుడు కార్బన్ డయాక్సైడ్, హైడ్రోజన్ లు సమృద్ధిగా ఉండేవని, నీరు ప్రవహించడానికి, సూక్ష్మజీవులు వృద్ధి చెందడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉండేవని పరిశోధనల్లో తేలింది.

అక్కడ వాతావరణ మార్పులు సంభవించడం వల్లే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏర్పడి ఉండవచ్చు అని అరిజోనా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకాలజీ అండ్ ఎవల్యూషనరీ బయోలజీ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. దీంతో అక్కడ ప్రస్తుత జీవి మనుగడ సాధించే పరిస్థితులు లేవని, కానీ అక్కడ కలిగిన వాతావరణ మార్పుల వల్ల అంగారక గ్రహం గర్భంలో ఎన్నో విషయాలు కూరుకుపోయి ఉన్నాయని పరిశోధకులు నమ్ముతున్నారు.

భూమికి ప్రత్యామ్నాయ గ్రహం కోసం చూస్తున్న మానవాళికి.. తాజాగా అంగారక గ్రహం మీద జీవి మనుగడ సాధించిన ఆనవాళు లభించడం కొత్త నమ్మకాన్ని ఇస్తోంది. భూమికి ప్రత్యామ్నాయంగా అంగారక గ్రహం ఉంటే.. అక్కడ కలిగిన వాతావరణ మార్పులను పరిశోధిస్తే.. ఏదో ఒక ఉపాయం లభిస్తుందనే నమ్మకం శాస్త్రవేత్తలో కలుగుతోంది. మొత్తానికి నాసా యొక్క క్యూరియాసిటీ రోవర్ మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క మార్స్ ఎక్స్ ప్రెస్ శాటిలైట్ అక్కడి వాతావరణం మీద మరింత లోతుగా పరిశోధనలు చేయనున్నాయి.