తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేటలో హస్తం, గులాబీ పార్టీ శ్రేణుల మధ్య తీవ్రస్థాయిలో ఈ ఘర్షణ జరగడంతో, ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో అచ్చంపేట ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు క్యాంపు కార్యాలయం ముట్టడికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రయత్నించగా, టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.
ఈ క్రమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడంతో పాటు, అదే ఊపులో తోపులాట చోటు చేసుకుంది. ఒకరి పై ఒకరు రాళ్లు రువ్వుకుంటూ, కర్రలతో దాడులు చేసుకోవడంతో సిట్యువేషన్ పీక్స్‌కు వెళ్ళింది. మరోవైపు టీఆర్ఎస్ కార్యకర్తలు, కొందరు కాంగ్రెస్ కార్యర్తల పై భౌతిక దాడులకు దిగారు. దీంతో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలకు గాయాలు అయయారు. ఘర్షణ జరుగుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్ని వదిలేసి, కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలను వదిలేసి తమ కార్యకర్తలను తీసుకెళ్లారని , పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
