Chinthachiguru Prawns Curry: సండే వచ్చిందంటే చాలు.. చాలా మంది చికెన్, మటన్ తినడానికే ఇష్టపడతారు. సీ ఫుడ్ ప్రియులు ..ఫిష్, రొయ్యలను తింటారు. రొయ్యల్లో ఇగురు, వేపుడు, కూర, బిర్యానీ కూడా సూపర్ టేస్ట్ గా ఉంటాయి. అయితే రొయ్యల్లో ఎప్పుడైనా చింతచిగురు వేసి ట్రై చేశారా? చింతచిగురు పచ్చిరొయ్యల కూర.. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే.. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఎలా చేయాలో, అందుకు ఏయే పదార్థాలు కావాలో తెలుసుకుందాం.
చింతచిగురు, పచ్చిరొయ్యల కూర రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చిరొయ్యలు – 1/2 కప్పు
చింతచిగురు – 1 కప్పు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 5
పసుపు – 1/2 స్పూన్
కారం – 1 స్పూన్
ఉప్పు – రుచికి సరిపడా
నూనె – తగినంత
చింతచిగురు పచ్చిరొయ్యలు కూర తయారీ విధానం
ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసి.. కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి పక్కనపెట్టుకుంటే మంచిది. చింత చిగురుని ఏరి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని వేసి వేయించాలి. గెల్డెన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాక.. పచ్చిరొయ్యలు వేసి.. నీరు ఇగిరిపోయేంత వరకూ ఉడకనివ్వాలి.
రొయ్యలు కాస్త మగ్గిన తర్వాత.. చింతచిగురుని వేసి మూతపెట్టాలి. 10 నిమిషాల తర్వాత.. కారం, ఉప్పు వేసి అవసరమైతే నీటిని కలుపుకోవచ్చు. మరోసారి మూతపెట్టి 15 నిమిషాల సేపు చిన్న మంటపై ఉడకనివ్వాలి. ఇగురులాగా వచ్చాక స్టవ్ ను ఆఫ్ చేస్తే.. టేస్టీ టేస్టీ చింతచిగురు రొయ్యల కూర రెడీ. వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుని తింటే.. ఆ రుచే వేరు.
నాన్ వెజ్ వంటకాల్లో.. రొయ్యలు చాలా ఆరోగ్యకరమైనవని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఎంత తిన్నా శరీరంలో కొవ్వు చేరదు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడకుండా కాపాడుతాయి. రొయ్యల్లో ఉండే సెలీనియం శరీరంలో క్యాన్సర్ కణతులు పెరగకుండా అడ్డుకుంటుంది. వయసుమీద పడే కొద్దీ వచ్చే మతిమరుపును రాకుండా అడ్డుకునే శక్తి రొయ్యలకే ఉంది. బరువు తగ్గాలనుకునేవారు కూడా రొయ్యల్ని తినొచ్చు. రొయ్యలను తరచూ తినేవారిలో లైంగిక సామర్థ్యం పుష్కలంగా ఉంటుంది.