Site icon HashtagU Telugu

Fire at Blind School: పాఠశాలలో అగ్నిప్రమాదం.. 11 మంది మృతి

4 killed In Fire

Fire

ఉగాండాలోని ఓ అంధుల పాఠశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అంధ విద్యార్థులతో సహా 11 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని స్థానిక జిల్లా అధికారి తెలిపారు. కుటుంబీకుల సహాయంతో డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తామన్నారు.

రాజధాని కంపాలాకు తూర్పున 30 కి.మీ దూరంలో ఉన్న ముకోనోలోని సలామా అంధుల పాఠశాలలో అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. సలామా అంధుల పాఠశాలలో బాధిత వసతి గృహంలో ప్రమాద సమయంలో 27 మంది పిల్లలు నిద్రిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించామని, మరిన్ని వివరాలు తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

తూర్పు ఆఫ్రికా దేశంలో ఇటీవల సంవత్సరాలలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. 2018 నవంబర్ లో దక్షిణ ఉగాండాలోని బోర్డింగ్ స్కూల్‌లో జరిగిన అనుమానాస్పద కాల్పుల్లో 11 మంది బాలురు చనిపోగా.. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అంతకముందు 2008 ఏప్రిల్ లో ఉగాండా రాజధాని సమీపంలోని ఒక జూనియర్ పాఠశాల వసతి గృహంలో అగ్నిప్రమాదం సంభవించినప్పుడు సిబ్బందితో సహా 18 మంది పాఠశాల బాలికలు సజీవదహనమయ్యారు. 2006 మార్చిలో పశ్చిమ ఉగాండాలోని ఇస్లామిక్ పాఠశాలలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు సుమారు 13 మంది పిల్లలు మరణించారు. అనేకమంది గాయపడ్డారు. అదే ఏడాది జులైలో తూర్పు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు చనిపోయారు.

 

Exit mobile version