ఏపీలో కొత్త జిల్లాల్లో మౌలిక వసతుల ఏర్పాట్లను మార్చి 25లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై గురువారం ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, హెచ్‌ఓడీలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. కలెక్టరేట్లు, ఆర్డీఓ కార్యాలయం, ఇతర కార్యాలయాల ఏర్పాటుకు అనువైన భవనాలను త్వరగా గుర్తించాలన్నారు.
వారం రోజుల్లో కొత్త కలెక్టరేట్లకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులు, భవనాల శాఖ నిర్ణయించిన ధరల ప్రకారం ప్రభుత్వ కార్యాలయాల స్థానానికి తీసుకోవాల్సిన భవనాల అద్దెలను ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి త్వరలో సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రిన్సిపల్ సెక్రటరీ (రవాణా, రోడ్లు, భవనాలు) ఎంటీ కృష్ణబాబు మాట్లాడుతూ కొత్త జిల్లాల్లో 17 ఆర్డీఓ కార్యాలయాలకు కార్యాలయాల గుర్తింపుపై వివరాలు సేకరించామని, అవసరమైన ఫర్నిచర్ కొనుగోలు కోసం వివిధ కంపెనీలతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.