Hyderabad: ఆండ్రాయిడ్ మొబైల్ అందుబాటులోకి వచ్చాక దాని ప్రయోజనాలు పక్కనపెడితే ఎంతోమంది దానికి బానిసగా మారుతున్నారు. ప్రపంచాన్ని మరిచిపోయేంతగా లీనమై ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా ఉత్పన్నమవుతున్నాయి. మరీ ముఖ్యంగా చిన్నారులు మొబైల్ బారీన పడి ప్రాణాలను సైతం లెక్కచేయడం లేదు. తాజాగా హైదరాబాద్ లో మరో సంఘటన వెలుగు చూసింది.
ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసైన పదో తరగతి విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాయదుర్గంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రేహాష్ రెడ్డి (14) నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసై చదువుపై శ్రద్ధ పెట్టడం లేదని తల్లిదండ్రులు అతన్ని మందలించారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో నిరాశ చెందిన యువకుడు ఆ కుటుంబం నివాసం ఉండే అపార్ట్మెంట్ భవనంలోని 14 వ అంతస్తు నుండి కిందకు దూకాడు.దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు.రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.