మనిషి పుట్టుకను ఎవరూ నిర్ణయించలేరు. మనిషి పుట్టుకతో వచ్చిన రూపాన్ని కూడా మార్చలేరు. అది రంగు అయినా, వైకల్యం అయినా, మరేదైనా సరే. ఈ విషయం తెలిసినప్పటికీ కొందరు వ్యక్తులు మాత్రం ఎదుటివారిని చూసి అవహేళన చేస్తుంటారు. నువ్వేంటి ఇలా ఉన్నావ్..? అలా ఉన్నావ్..? అని కామెంట్స్ చేస్తుంటారు. ఇలాంటి మాటలు అన్నప్పుడు వాళ్లు చాలా బాధపడతారు. కొంతమంది లైట్ తీసుకుంటారు. మరికొందరు మనస్సులో పెట్టుకుంటారు. కొంతమంది వారి మాటలను తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి గురవుతారు. స్త్రీలు ఇలాంటి విషయాలలో చాలా సెన్సిటీవ్‌గా ఉంటారు.
ఓ వ్యక్తి తన భార్య నల్లగా ఉందని, అందంగా లేదని రోజు వేధించాడు. దీంతో ఆ మహిళ మనస్తాపంతో భర్త అని కూడా చూడకుండా హత్య చేసింది. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా అమలేశ్వర్ గ్రామంలో అనంత్, సంగీత అనే దంపతులు నివాసముంటున్నారు. అనోన్యంగా ఉండాల్సిన దంపతులిద్దరూ నిత్యం గొడవపడేవారు. భార్యను అందంగా లేదని భర్త అనంత్ కామెంట్స్ చేసేవాడు. ఇలా భార్య అందంగా లేదు అని అనంత్ రోజు సంగీతను సూటిపోటి మాటలు అంటూ వేధించేవాడు. ఇలా భర్త కామెంట్స్ చేసిన ప్రతిసారి భార్య, భర్తల మధ్య గొడవలు జరిగేవి.
ఈ నేపథ్యంలో ఇటీవల అనంత్ తన భార్యను అందంగా లేవంటూ మరోసారి వేధించడంతో తీవ్ర మనస్థాపం చెందిన సంగీత భర్తపై దాడి చేసింది. భార్య గొడ్డలితో దాడి చేయడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. తన భర్తను ఎవరో చంపేశారంటూ భార్య స్థానికులకు చెప్పింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి వారి పద్ధతిలో విచారించగా భార్య సంగీత అసలు విషయం బయటపెట్టింది. నేరం ఒప్పుకున్న నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.