Site icon HashtagU Telugu

GT vs CSK: ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్… చెపాక్ లో గుజరాత్ కు చెక్

GT vs CSK

Whatsapp Image 2023 05 23 At 11.59.11 Pm

GT vs CSK: ఐపీఎల్ 16వ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ కు చెపాక్ లో చెక్ పెట్టింది. సమిష్టిగా రాణించిన ధోనీసేన 15 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ను నిలువరించింది. తద్వారా లీగ్ ఆరంభ మ్యాచ్ లో ఎదురైన ఓటమికి రివేంజ్ తీర్చుకుంది.

మొదట బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఓపెనర్లు రుతురాజ్, కాన్వే మరోసారి అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. నో బాల్ కావడంతో ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రుతురాజ్ మరో హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. కాన్వేతో కలిసి తొలి వికెట్ కు 87 పరుగులు జోడించాడు. ధాటిగా ఆడిన రుతురాజ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్సర్ తో 60 పరుగులకు ఔటవగా.. వన్ డౌన్ లో వచ్చిన శివమ్ దూబే నిరాశపరిచాడు. రహానే 17 పరుగులకు ఔటవగా.. కాన్వే 34 బంతుల్లో 40 రన్స్ కు వెనుదిరిగాడు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ గాడి తప్పినట్టు కనిపించింది. అయితే అంబటి రాయుడు , రవీంద్ర జడేజా చివర్లో మెరుపులు మెరిపించారు. జడేజా 16 బంతుల్లో 22 పరుగులు చేశాడు. ఒక దశలో భారీస్కోర్ చేస్తుందనుకున్నచెన్నైని గుజరాత్ బౌలర్లు బాగానే కట్టడి చేశారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో షమీ 2, మోహిత్ శర్మ 2 వికెట్లు పడగొట్టారు.

173 పరుగుల లక్ష్య ఛేదనలో గుజరాత్ ఆరంభం నుంచే తడబడింది. ఓపెనర్లు సాహా, గిల్ సరైన ఆరంభాన్నివ్వలేకపోయారు. సాహా 12 పరుగులకు ఔటవగా.. కెప్టెన్ హార్థిక్ పాండ్యా మళ్ళీ నిరాశపరిచాడు. కేవలం 8 రన్స్ కే వెనుదిరిగాడు. గిల్ తో కలిసి ధాటిగా ఆడే ప్రయత్న చేసిన శనక 17 రన్స్ కు ఔటవడంతో గుజరాత్ 3 వికెట్లు కోల్పోయింది. అటు డేవిడ్ మిల్లర్ , శుబ్ మన్ గిల్ వెంటవెంటనే ఔటవడంతో గుజరాత్ మళ్ళీ కోలుకోలేకపోయింది. చెన్నై బౌలర్లు సొంతగడ్డపై అద్భుతంగా రాణించి గుజరాత్ ను కట్టడి చేశారు. దీంతో గుజరాత్ ఓటమి ఖాయమైపోయింది. చివర్లో రషీద్ ఖాన్ మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. చివరికి డిఫెండింగ్ ఛాంపియన్ 157 పరుగులే చేయగలింది. చెన్నై బౌలర్లలో జడేజా , తీక్షణ, పతిరణ , దీపక్ చాహార్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఈ విజయంతో చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్ కు చేరుకోగా.. ఓడినప్పటకీ గుజరాత్ కు మరో అవకాశముంది. లక్నో, ముంబై మధ్య జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ విజేతతో గుజరాత్ రెండో క్వాలిఫైయిర్ లో తలపడుతుంది.

Read More: GT vs CSK: దర్జాగా ఫైనల్‌కు చేరుకున్న చెన్నై సూపర్ కింగ్స్

Exit mobile version