CM Chandrababu : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు నగరంలో పర్యటించారు. ఆర్కే బీచ్ వద్ద ప్రధానంగా జరిగే ఈ విశిష్ట కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షణ చేశారు. ఇందులో ఐదు లక్షల మందికి పైగా పాల్గొనే అవకాశముండటంతో విశాఖ నగరం మొత్తం యోగా ముస్తాబు అయ్యింది. నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు ఈ కార్యక్రమానికి సంబంధించి తీసుకుంటున్న ఏర్పాట్లను సీఎంకు వివరించారు. బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ వివరించారు.
607 సచివాలయాల సిబ్బంది ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నారని, వారి సమన్వయ బాధ్యతలు సజావుగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా, ప్రధాన కార్యక్రమానికి ముందు ఉదయం 6:30 నుంచి 8:00 గంటల మధ్య మాక్ యోగా కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.
భద్రతాపరంగా ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేసిన చంద్రబాబు… వాహనాల పార్కింగ్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, ప్రజల రాకపోకలపై అధికారులను దిశానిర్దేశం చేశారు. ఆర్కే బీచ్ ప్రాంతం తరువాత, ఆయన ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్‌కు వెళ్లి అక్కడి ఏర్పాట్లను కూడా సమీక్షించారు.