ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. కాగా, చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్భంగా సుప్రీంకోర్టును కోరారు అప్పటి ప్రభుత్వం తరపు న్యాయవాదులు. అందుకు సంబంధించిన వివరాలతో ఇంటర్‌లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేసినట్లు జస్టిస్ బేలాఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనంకు తెలిపారు న్యాయవాదులు.
అయితే, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ హైకోర్టు.. చంద్రబాబుకి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ సీఐడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.. స్కిల్ కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేయగా.. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో 53 రోజులు రిమాండ్‌లో ఉన్నారు.. ముందు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం విదితమే.. దీంతో. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ అప్పటి ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది.. ఆ పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.