ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ తీర్పును గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
శుక్రవారం సుప్రీం కోర్టులో ఈ కేసు విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గి వర్చువల్ గా వాదనలు వినిపించారు. బెయిల్ రద్దును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటాం అని ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. తాను ఢిల్లీలో లేనని, విచారణకు స్వయంగా హాజరు కావాలనుకుంటున్నందువల్ల జనవరి వరకు సమయం ఇవ్వాలని ఆయన కోరారు. దీనిపై, జస్టిస్ బేలా ఎం. త్రివేదీ ధర్మాసనం జనవరి రెండో వారానికి ఈ కేసు విచారణ వాయిదా వేసినట్లు ప్రకటించింది.
స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) క్లీన్ చిట్ ఇచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో, ఏపీ సీఐడీ ఆధ్వర్యంలో నమోదైన కేసు ఆధారంగా ఈడీ విచారణను చేపట్టింది. అయితే, ఈడీ తాజా ప్రకటన ఇప్పుడు చాలా కీలకంగా మారింది.
ఈడీ విచారణలో, నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని రుజువైంది. దీనితో, వైసీపీ నేతలు చేసిన అసత్య ప్రచారంపై ఈడీ స్పష్టమైన నివేదిక ఇచ్చింది.
గత సంవత్సరం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2014-2019 కాలంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో జరిగిన స్కామ్ ఆధారంగా, సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. 53 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, హైకోర్టు నుండి బెయిల్ పొందిన తర్వాత జైలు నుంచి విడుదల అయ్యారు. ఈడీ తాజా విచారణతో, చంద్రబాబు పై పెరిగిన అనుమానాలు తొలగిపోయి, ఆయనకు ఈ కేసులో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తెలిసింది.
పీవీ రమేశ్ సంచలన వ్యాఖ్యలు: చంద్రబాబు అరెస్ట్ వెనుక పెద్ద కుట్ర
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ ఓ ఛానల్ ఇంటర్వ్యూ లో సంచలనమైన విషయాలు బయటపెట్టారు. ఆయన వివరించిన ప్రకారం, చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనుక ఒక పెద్ద కుట్ర జరిగింది. ఈ కుట్రలో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయంలోని పలువురు ఉన్నారని, పోలీసులు కూడా ఈ కుట్రలో భాగమై వ్యవహరించినట్లు తెలిపారు.
పీవీ రమేశ్ మాట్లాడుతూ, పోలీస్ శాఖలో కూడా ఈ కేసుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారని, వారు ఇప్పటికీ పదవుల్లో కొనసాగుతున్నారని చెప్పారు. ఆయన ఈ సందర్భంగా, తాను అప్పట్లో ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను వక్రీకరించి వాడారని, ఈ కారణంగా తాము న్యాయ పోరాటం ప్రారంభించనున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాక, ఈ వ్యవహారంలో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీజీపీకి లేఖ రాశానని ఆయన తెలిపారు.
పీవీ రమేశ్, అప్పటి సీఐడీ అధికారులు స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఫైళ్లను మాయమయ్యాయని చెప్పిన విషయం గురించి మాట్లాడుతూ, అది “అత్యంత హాస్యాస్పదం” అని అభిప్రాయపడినారు. “ఫైళ్లు మాయమయ్యాయని చెప్పడంలోనూ పెద్ద కుట్ర దాగి ఉందని” ఆయన చెప్పారు. ఈ కేసును వీలైనంత త్వరగా నిగ్గు తేల్చడం, కూటమి ప్రభుత్వానికి మంచిదని పీవీ రమేశ్ వ్యాఖ్యానించారు.