ఏపీలో మూవీ టికెట్స్ రేట్స్‌తో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై స్పందించేందుకు, గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చర్చలు సానుకూలంగా జరగడం పరస్పర ప్రయోజనాలు చేకూరేలా అటు ఏపీ ప్రభుత్వం, ఇటు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ అంగీకారం తెలిపాయని తెలుస్తోంది. జగన్‌తో సమావేశం తర్వాత మీడియా ముందుకు వచ్చిన సినీ స్టార్స్ జగన్ పై ప్రశంసలు కురిపించారు. ఇండస్ట్రీ సమస్యలు జగన్ అర్ధం చేసుకున్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ వింటారని తెలిపారు.
ఇక ఈ భేటీ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీ ప్రభుత్వం ఒకవైపు చిత్ర పరిశ్రమలో సమస్యలు సృష్టించి, దాని పరిష్కారానికి కృషి చేస్తానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. టాలీవుడ్‌లో లేని సమస్యలను సృష్టించి, చర్చల పేరిట తన వద్దకు పిలిపించుకుని, పరిష్కారం చేస్తామని చెప్పడం చూస్తుంటే, ఇలా కూడా చేయవచ్చా అని చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాను సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసినా, ముఖ్యమంత్రిగా పని చేసినా, ఏనాడు సినీ పరిశ్రమ జోలికి పోలేదని చంద్రబాబు అన్నారు. సినిమా వాళ్ళు వారి పనేదో వాళ్ళు చూసుకుంటారని, అలాంటి వారిపై కూడా జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు దిగుతుందని, దీంతో వైసీపీని చరిత్ర క్షమించదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మరి చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణుల నుండి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి.
