Chandrababu Birthday: 74వ వసంతంలోకి అడుగుపెట్టిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈ రోజు. చంద్రబాబు ఏప్రిల్ 20, 1950 సంవత్సరంలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు

Chandrababu Birthday: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఈ రోజు. చంద్రబాబు ఏప్రిల్ 20, 1950 సంవత్సరంలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. 7 పదుల వయస్సు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఆయన సొంతం. దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రధానిని నిర్ణయించిన చరిత్ర చంద్రబాబు నాయుడిది. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా.. 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు చేపట్టి దేశ ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమిపాలవడంతో.. ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు.

చంద్రబాబు చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో జన్మించారు. తండ్రి ఖర్జూర నాయుడు, తల్లి అమ్మణ్ణమ్మ. ఇక ఆయన చదువు విషయానికి వస్తే.. తిరుపతిలోని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బీఏ, ఎకనమిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానం విద్యార్థి దశ నుంచే ప్రారంభమైంది. తన రాజకీయ మొదటి అడుగు కాంగ్రెస్ పార్టీతో మొదలైంది. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28వ ఏళ్ల వయసులోనే.. టంగుటూరి అంజయ్య మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లాడారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు. కానీ అప్పుడు చంద్రబాబు కాంగ్రెస్‌లోనే ఉన్నారు. 1983 ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించి తెలుగు జాతిని తలెత్తుకునేలా చేసింది. తదనంతరం చంద్రబాబు నాయుడు టీడీపీ తీర్ధం పుచ్చుకుని ఎన్టీఆర్ కు అల్లుడు అయ్యారు.

ఎన్టీఆర్ మరణాంతరం టీడీపీ పార్టీని తన భుజస్కందాలపై వేసుకున్నారు. అనంతరం టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ,ముఖ్యంగా చంద్రబాబు అంటే గుర్తుకు వచ్చేది హైదరాబాద్ ఐటీ రంగం. తన ముందు చూపుతో ఐటీ రంగాన్ని ప్రోత్సహించి హైదరాబాద్‌ను అంతర్జాతీయ పటంలో అగ్రగామిగా నిలిపారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా యువతకు అనేక ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ కేంద్రంగా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. యునైటెడ్‌ ఫ్రంట్ కన్వీనర్‌గా దేవెగౌడ, ఐ.కె.గుజ్రాల్‌లను ప్రధానులుగా చేశారు. 1999లో వాజపేయి నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ముస్లిం వర్గానికి చెందిన ప్రఖ్యాత అణు శాస్త్రవేత్త అబ్దుల్‌ కలాంను రాష్ట్రపతిగా చేయటంలో కీలక పాత్రను పోషించారు. దళిత నేత జిఎంసి బాలయోగిని అత్యున్నత చట్టసభ లోక్‌సభ స్పీకర్‌గా చేశారు.

చంద్రబాబు నాయుడు నేటితో 74వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బాబు పుట్టినరోజు వేడుకులను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు, కార్యకర్తలు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకోవడానికి పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు. పట్టణాలు, మండల కేంద్రాల్లో కేక్ కట్ చేసి తమ ప్రియతమ నాయకుడికి బర్త్ డే విశేష్ తెలియజేశారు. అలాగే రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహించారు. అన్నదానాలతోపాటు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Read More: Chandrababu Vision 2047: చంద్రబాబు విజన్ 2047, ఆవిర్భావ సభలో తెలుగుజాతికి దిశానిర్దేశం