Site icon HashtagU Telugu

TDP Srikalahasti: శ్రీకాళ‌హ‌స్తి టీడీపీ ఇంఛార్జ్‌కి బాబు క్లాస్‌..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికార‌మే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పావులు క‌దుపుతున్నారు. దీనికి ఇప్ప‌టి నుంచే ఆయ‌న యాక్ష‌న్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తాయ‌నే ఊహాగానాలు వినిపిస్తుండ‌టంతో అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కార్య‌క్ర‌మాలు, ఇంఛార్జ్ ల ప‌నితీరుపై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు.

తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గం స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ఇంఛార్జ్ బొజ్జ‌ల సుధీర్ రెడ్డి కి చంద్ర‌బాబు క్లాస్ తీసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాటులో ఉండ‌కుండా హైద‌రాబాద్ లో ఎక్కువ‌గా ఉంటున్నార‌ని కార్య‌క‌ర్త‌లు అధిష్టానానికి ఫిర్యాదులు చేయ‌డంతో సమావేశంలో గ‌ట్టిగా క్లాస్ తీసుకున్నారు. త‌న తండ్రి మాజీ మంత్రి బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డిలా క‌ష్ట‌ప‌డాల‌ని సుధీర్ రెడ్డికి చంద్ర‌బాబు దిశానిర్ధేశం చేశారు.

నియోజ‌క‌వ‌ర్గంలో సుధీర్ రెడ్డిపై చేసిన స‌ర్వే రిపోర్ట్ ఫీడ్ బ్యాక్ ని ఆయ‌న‌కు వివ‌రించారు. ప‌ని తీరు మెరుగుప‌రుచుకోవాల‌ని లేదంటే ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు ఏర్ప‌డ‌తాయ‌ని సుధీర్ రెడ్డికి బాబు హెచ్చ‌రించారు.

శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం పార్టీకి మంచి ప‌ట్టు ఉంది. 2014 ఎన్నిక‌ల్లో బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి గెలిచి మంత్రి అయ్యారు. అయితే త‌న తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని సుధీర్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో పెత్త‌నం చెలాయించార‌నే ఆరోప‌ణ‌లు అప్పుడు వినిపించాయి. సుధీర్ రెడ్డి అవినీతి అక్ర‌మాల‌పై సొంత పార్టీ నేత‌లే అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

ఆ త‌రువాత మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో గోపాల‌కృష్ణారెడ్డికి మంత్రి ప‌ద‌వి పోయింది. ఆయ‌న‌కు కూడా అనారోగ్యం కార‌ణాల‌తో యాక్టీవ్ గా లేక‌పోవ‌డంతో ఆయ‌న కుమారుడికే టికెట్ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. 2019 ఎన్నిక‌ల్లో బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి కోరిక మేర‌కు ఆయ‌న కుమారుడు సుధీర్ రెడ్డికి టికెట్ ఇవ్వ‌గా ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఇంఛార్జ్ గా ఉన్నప్ప‌టికి నియోజ‌క‌వ‌ర్గంలో క్యాడ‌ర్ కి అందుబాటులో ఉండ‌టం లేదు.

వ్యాపారాల కోసం ఎక్కువ‌గా హైద‌రాబాద్ లోనే నివ‌సిస్తున్నార‌ని అధిష్టానానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో బుధ‌వారం జ‌రిగిన స‌మీక్షా స‌మావేశంలో సుధీర్ రెడ్డి వ్య‌వ‌హారశైలిపై బాబు ఫైర్ అయ్యారు. ఇప్ప‌టి నుంచైనా కార్య‌క‌ర్త‌ల‌కు అందుబాబులో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యే అరాచ‌కాల‌పై పోరాడాల‌ని సూచించారు.