Free Tamatoes: ఇదేందయ్యా ఇది ఆటోలో ప్రయాణిస్తే కేజీ టమోటాలు ఫ్రీ.. ఆటో డ్రైవర్ బంపర్ ఆఫర్?

ప్రస్తుతం టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దేశంలో టమాట ధరలు కేజీ

  • Written By:
  • Publish Date - July 19, 2023 / 04:50 PM IST

ప్రస్తుతం టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోజురోజుకీ టమాటా ధరలు పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. దేశంలో టమాట ధరలు కేజీ రూ.150 నుంచి రూ.300 వరకు పలుకుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు టమోటాలను కొనడమే మానేశారు. ఇంకొందరు తప్పని పరిస్థితులలో టమోటాలను కొనుగోలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఆటో డ్రైవర్ టమోటాలు మండిపోతున్న నేపథ్యంలో ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన ఆటోలో ప్రయాణించే వారికి ఉచితంగా కిలో టమాటాలు ఇస్తున్నాడు. అయితే, ఇందుకు అతను ఒక నిబంధన పెట్టాడు.

తన ఆటోలో కనీసం ఐదుసార్లు ప్రయాణించిన వారికి మాత్రమే టమాటాలు ఉచితంగా ఇస్తున్నట్లు తెలిపాడు. పంజాబ్‌ లోని చండీగఢ్‌ కు చెందిన అరుణ్‌ గత 12 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్ని తాకడంతో ప్రజలకు తన వంతు సాయం చేయాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఉచిత టమాటాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆటో వెనుక బాగంలో అంటించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. నాకున్న ఏకైక ఆదాయ మార్గం ఆటోనే. దీని ద్వారా ఇలాంటి సేవలు అందించడం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది అని తెలిపాడు సదరు ఆటో డ్రైవర్.

అలాగే, పాకిస్థాన్‌తో త్వరలో జరగబోయే క్రికెట్ మ్యాచ్‌లో భారత్‌ గెలిస్తే చండీగఢ్‌లో ఐదు రోజులపాటు తన ఆటోలో ఉచిత ప్రయాణం అందిస్తానని వెల్లడించాడు. కాగా అరుణ్‌ గతంలో కూడా భారత సైన్యం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసి విజయవంతంగా తిరిగి వచ్చిన సందర్భంగా చండీగఢ్‌లో కొద్దిరోజులపాటు ఆటోలో ఉచిత ప్రయాణం అందించాడు. అంతేకాకుండా తన ఆటోలో గర్భిణీలకు, ప్రమాద బాధితులకు ఉచిత ప్రయాణం అందిస్తున్నందుకు చండీగఢ్‌ పోలీసుల నుంచి సత్కారం కూడా అందుకున్నాడు. ఇప్పటికీ తన ఆటోలో భారత సైనికులకు ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నాడు.