Site icon HashtagU Telugu

Harish Rao: చందాపూర్‌ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలి: హరీశ్ రావు

Harish Rao

Harish Rao

Harish Rao: సంగారెడ్డి జిల్లా చందాపూర్‌లోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని ఎంఎన్ఆర్ ఆస్పత్రిలో మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకోవడంలో ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం ఘోరంగా విఫలమమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో తరచూ రియాక్టర్లు పేలుతున్నాయి. చాలామంది చనిపోతున్నారు. అయినా ప్రభుత్వ పట్టించుకోవడం లేదు. అధికారులు ఏడాదికొకసారి రియాక్టర్లను తనిఖీ చేయకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. క్షతగాత్రులు ఏఏ ఆస్పత్రుల్లో ఉన్నారో స్పష్టం లేదు. ఎంతమంది చనిపోయారో, ఎంతమంది గాయపడ్డారో కూడా స్పష్టత లేదు’’ ఆని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘బాధితుల బాగోగులు ఎవరు చూస్తున్నారో కూడా తెలియడం లేదు. మంత్రులొచ్చి లాంఛనంగా పరామర్శించడం కాదు, చిత్తశుద్ధితో ఆదుకోవాలి. ప్రమాదానికి బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలి. మృతుల కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం, గాయపడిన వారికి 25 లక్షలు పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని బీఆర్ఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వైద్య ఖర్చులను ప్రభుత్వం, కంపెనీ భరించాలి. మృతదేహాలను స్వగ్రామానికి పంపడానికి అంబులెన్సులు సమకూర్చి సాయం చేయాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి’’ అని డిమాండ్ చేశారు.

‘‘కార్మికుల కుటుంబ సభ్యులపై దురుసుగా ప్రవర్తించడం, పోలీసులు లాఠీ చార్జీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దుఃఖంలో ఉన్నావారికి అండగా నిలబడి ఆదుకోవాలి తప్ప ఇలా వేధించడం సరికాదు.తెలంగాణకు చెందిన బాధితులకు బీఆర్ఎస్ తరఫున మేం సాయం అందిస్తాం. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా, రియాక్టర్లు పేలకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి’’ అని హరీశ్ రావు అన్నారు.

Exit mobile version