Andhra Pradesh: మదనపల్లె-పీలేరు నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు

  • Written By:
  • Updated On - February 24, 2022 / 03:17 PM IST

జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా మదనపల్లె-తిరుపతి నాలుగు లైన్లకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. భారతమాల ప్రాజెక్టు కింద రూ.1,852.12 కోట్లు విడుదల చేస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ట్విట్టర్‌లో తెలిపారు. ఈ నిధులతో ఎన్ హెచ్-71 మొదటి దశగా 55.9 కి.మీ మేర మదనపల్లె-పీలేరు రహదారిని నిర్మించనున్నారు. తిరుపతి-మదనపల్లె ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. ఘాట్‌ రోడ్డు ఇరుకుగా ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల ప్రజలు తిరుపతికి వెళ్లాలంటే ఇదొక్కటే మార్గం. ఈ క్రమంలో రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా మారుస్తే సౌకర్యంగా ఉంటుందని సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మిథున్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కింద NH-71ని మార్చడానికి ప్రయత్నాలు చేశారు. ఇదిలా ఉండగా మార్గం మధ్యలో వచ్చే రైల్వే గేట్లకు ఆర్‌ఓబీల నిర్మాణానికి కూడా అనుమతి లభించింది. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత గల జోన్‌లో చేర్చాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని పలుమార్లు అభ్యర్థించారు.