Aravalli: అరావళి పర్వతమాల పరిరక్షణ విషయంలో సాగుతున్న వివాదాల మధ్య కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అరావళి ప్రాంతంలో కొత్త మైనింగ్ లీజులపై తక్షణమే నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర అటవీ- పర్యావరణ మంత్రిత్వ శాఖ దీనిపై రాజస్థాన్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. కొత్త మార్గదర్శకాలు సిద్ధమయ్యే వరకు ఎటువంటి కొత్త మైనింగ్ అనుమతులు ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
కొత్త లీజులపై పూర్తి నిషేధం
అరావళి పర్యావరణ వ్యవస్థను దీర్ఘకాలం పాటు కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రం తెలిపింది. జీవవైవిధ్య సంరక్షణలో ఈ పర్వత శ్రేణులు పోషిస్తున్న పాత్రను గుర్తించి, కొత్త లీజులను పూర్తిగా నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఇప్పటికే కొనసాగుతున్న మైనింగ్ కార్యకలాపాలను కూడా పర్యావరణ నిబంధనల ప్రకారం కఠినంగా నియంత్రించనున్నట్లు పేర్కొంది.
Also Read: టీ20 వరల్డ్ కప్ 2026 జట్టు నుండి శుభ్‌మన్ గిల్ అవుట్.. కారణమిదేనా?
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కీలక ఆదేశాలు
ఈ నిషేధం గుజరాత్ నుండి ఢిల్లీ వరకు విస్తరించి ఉన్న అరావళి పర్వత ప్రాంతం అంతటా సమానంగా వర్తిస్తుంది. అరావళి శ్రేణి సమగ్రతను కాపాడటమే దీని ప్రధాన ఉద్దేశ్యం. క్రమబద్ధీకరించని, అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం ద్వారా భౌగోళిక రిడ్జ్‌గా ఉన్న అరావళిని రక్షించాలని కేంద్రం భావిస్తోంది.
ICFREకి కీలక బాధ్యతలు
పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ (ICFRE) కు కూడా కొన్ని ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. మైనింగ్ పూర్తిగా నిషేధించాల్సిన అదనపు ప్రాంతాలను గుర్తించాలని సూచించింది. శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర నిర్వహణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇది పర్యావరణ ప్రభావం, ఆ ప్రాంత సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది. సున్నితమైన, రక్షణ అవసరమైన ప్రాంతాలను గుర్తించి, నిషేధిత పరిధిని పెంచాలని నిర్ణయించింది.
సుప్రీంకోర్టు ఆదేశాల అమలు
ప్రస్తుతం నడుస్తున్న గనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల ప్రకారం పర్యావరణ భద్రతా చర్యలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని ఆదేశించింది. పర్యావరణ హితమైన మైనింగ్ పద్ధతులను పాటించని పక్షంలో కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
