5G Network: ఇండియాలో 5జీ సేవ‌లు.. డేట్ ఫిక్స్ చేసిన కేంద్రం..!

  • Written By:
  • Updated On - February 26, 2022 / 02:53 PM IST

ఇండియ‌లో 5జీ టెలికాం సేవలు త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా దేశంలో 5జీ టెలికాం సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ విషయం పై ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం టెలికాం శాఖను ఆదేశించింది. ఈ క్ర‌మంలో 5జీ స్పెక్ట్రంకు సంబంధించిన సిఫార్సులను మార్చి చివరి నాటికి అందించాలని టెలికాం శాఖ ట్రాయ్‌ను కోరింది. 5జీ సేవలపై ఇటీవల ట్రాయ్‌ పలు పరిశ్రమల ప్రతినిధులు, ఇతర భాగస్వాములతో ఒక చర్చా కార్యక్రమం కూడా నిర్వహించింది. అల్ట్రా హైస్పీడ్‌ డేటా కోసం తీసుకురానున్న 5 జీ అంశాన్ని పరిశీలించి, త్వరగా సిఫార్సులు, అభిప్రాయాలను తెలుపాలంటూ టెలికాం శాఖ ట్రాయ్ ను కోరింది.

ఇక‌ దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ స్పీడుతో పోలిస్తే ఇంటర్‌నెట్ స్పీడ్‌ 10 రెట్లు పెరగనుంద‌ని టెక్ నిపుణుల చెబుతున్నారు. ప్రస్తుతం 5జీ స్పెక్ట్రమ్‌ వేలానికి సంబంధించి ట్రాయ్‌ ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. 700 ఎమ్‌హెచ్‌జెడ్‌ నుంచి 526-698 ఎమ్‌హెచ్‌జెడ్‌ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల వేలానికి పాటించాల్సిన పద్ధతులను ట్రాయ్‌ రూపొందిస్తోంది. ఇక అటు టెలికాం కంపెనీలు సైతం 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధమవుతున్నాయి. అయితే స్పెక్ట్రమ్‌ ధరలను తక్కువగా నిర్ణయించాలని పరిశ్రమ వర్గాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఇక భారత్‌లో 5జీ సేవలు ఇంకా అందుబాటులోకి రాకముందే 5జీ సపోర్ట్ ఫోన్‌లు మార్కెట్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో ఇప్పటికే పలు బ్రాండ్‌లు 5జీ ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి.