Site icon HashtagU Telugu

Airport : వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Center green signal for Warangal Airport

Center green signal for Warangal Airport

Airport : వరంగల్‌ మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక రన్ వే నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి ఇస్తే చాలు… పనులు ప్రారంభిస్తారు. ఇప్పటికే మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణకు తెలంగాణ సర్కార్ రూ.205 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ సూచనల మేరకు భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రోజుల కిందటే మార్గదర్శకాలు జారీ చేసింది. ఆ మేరకు అధికారులు భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభించారు.

Read Also: Uttarakhand: ఉత్త‌రాఖండ్‌లో భారీ హిమ‌పాతం.. 57 మంది కూలీలు గ‌ల్లంతు

మామూనూరులో ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్ ఉంది. తొలి దశలో చిన్న విమానాల రాకపోకలకు వీలుగా 253 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించింది. అదు కోసం రూ. 205 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించారు. కాగా, మామునూరు ఎయిర్ పోర్టులో తొలి దశను డిసెంబరులోగా పూర్తి చేసి దేశీయ విమానాల రాకపోకలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులపై ఆరా తీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి గతంలో కేరళ రాష్ట్రంలోని ప్రఖ్యాత కొచ్చిన్ అంతర్జాతీయ విమానశ్రయం తరహాలో మామునూరు ఎయిర్‌పోర్టు ఉండాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.

ప్రస్తుతం తెలంగాణలో శంషాబాద్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా మరో 6 చోట్ల ప్రాంతీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు కొన్నేళ్లుగా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే వ‌రంగ‌ల్ జిల్లా ఖిలా వ‌రంగ‌ల్ మండ‌లంలో నిర్మించనున్న ఈ మామూనూరు ఎయిర్‌పోర్టు కోసం ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం గతంలో సంప్రదింపులు చేసింది. తాము సూచించిన అదనపు భూమి కేటాయిస్తే ఎయిర్‌పోర్ట్ నిర్మాణ వ్యవహారాలు ప్రారంభిస్తామంటూ ఏఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి గతంలో లేఖ రాసింది. ప్రస్తుతమున్న 1.8 కి.మీ రన్‌‌వేని 3.9 కి.మీకి విస్తరించడానికి వీలుగా భూసేక‌ర‌ణ అవ‌స‌ర‌మ‌ని తెలిపింది. దీంతో బోయింగ్ 747 వంటి పెద్ద విమానాలు కూడా రావడానికి వెసులుబాటు దొరుకుతుంద‌ని పేర్కొన్నది.

Read Also: AP Budget : ఈ బడ్జెట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే : సీఎం చంద్రబాబు