Site icon HashtagU Telugu

Jammu: CISF బస్సుపై ఉగ్రదాడి.. వీడియో విడుదల

Jammu Encounter

Jammu Encounter

జమ్మూ శివార్లలోని సుంజ్వాన్‌ గ్రామంలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF) బస్సుపై ఫిదాయిన్ ఉగ్రవాదులు (ఆత్మాహుతి దళ సభ్యులు) శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం దానికి సంబంధించిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. దాని ప్రకారం..సుంజ్వాన్‌ గ్రామంలో అంతా నిశ్శబ్దంగా ఉంది. చడీ చప్పుడు లేదు. 15 మంది సిబ్బంది తో కూడిన CISF బస్సు ఆ గ్రామం మీదుగా జమ్మూ విమానాశ్రయం వైపు వెళ్తోంది. ఊరిలోని మెయిన్ రోడ్ లో ఒక మూల మలుపు వద్దకు రాగానే.. ఉగ్రవాదులు బస్సుపైకి గ్రెనేడ్లు విసిరారు. తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో పరిసరాల్లో తుపాకుల కాల్పుల మోతలు మార్మోగాయి. చుట్టూ పొగ కమ్మేసింది.

ఈఘటనలో సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) SP పాటిల్ వీరమరణం పొందారు. బస్సులో కూర్చున్న ఇద్దరు CISF భద్రతా సిబ్బంది గాయపడ్డారు. భద్రతా దళాల ప్రతికాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిని పాకిస్తాన్ ఆధారిత జైష్ ఎ మహ్మద్ ఆత్మాహుతి దళ సభ్యులుగా గుర్తించారు. ఈనెల 24న జరగనున్న ప్రధానమంత్రి మోడీ జమ్మూ, కశ్మీర్ పర్యటనకు అంతరాయం కలిగించడానికి ఉగ్రవాదులు ఈ కుట్ర పన్నారని కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ వెల్లడించారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, సాంబా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడిన ఇద్దరు ఉగ్రవాదులు.. గురువారం జమ్మూ నగర శివార్లలోకి ప్రవేశించి ఆర్మీ క్యాంపు సమీపంలోని ప్రాంతంలో మకాం వేశారు. ఈ ఘటన నేపథ్యంలో ఎన్‌ఐఏ, రాష్ట్ర దర్యాప్తు సంస్థ సంయుక్త బృందం ఎన్‌కౌంటర్ స్థలాన్ని సందర్శించాయి. కేసు దర్యాప్తును ప్రారంభించాయి.