Viveka Murder Case: అవినాష్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం? కర్నూల్ లో హైటెన్షన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది

Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ మంత్రి వివేకా హత్య కేసు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే సీబీఐ పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తుంది. ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (Ys Avinash Reddy) పేరు ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పటికే అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర రెడ్డిని సిబిఐ కస్టడీకి తీసుకుంది. దీంతో అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ ఖాయమంటూ గతకొంతకాలంగా కథనాలు వెలువడుతున్నాయి. అయితే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని ప్రధాన అనుమానితుడిగా సీబీఐ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయనను విచారించింది. ఇకపోతే తాజాగా అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరవ్వాల్సి ఉండగా.. తల్లికి గుండెపోటు కారణంగా సీబీఐ విచారణకు హాజరవ్వలేనంటూ సీబీఐ అధికారులకు లేఖ రాశాడు. కాగా సీబీఐ తిరిగి అవినాష్ రెడ్డికి మరో లేఖ రాసింది. సీబీఐ విచారణకు హాజరు కావాల్సిందేనంటూ తేల్చేసింది. దీంతో ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం అవినాష్ రెడ్డి కర్నూల్ లోని విశ్వభారతి ఆస్పత్రిలో ఉన్నారు. తల్లికి గుండెపోటు కారణంగా ఆమె అదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఈ రోజు సోమవారం సిబిఐ అధికారులు కర్నూల్ చేరుకొని అవినాష్ రెడ్డి ఉంటున్న విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆస్పత్రి వద్ద ఇప్పటికే భారీగా పోలీస్ బలగాలు చేరుకున్నాయి. ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరా నిలిపివేసినట్లు తెలుస్తుంది. కాగా సీబీఐ అధికారులు స్థానికి ఎస్పీతో మాట్లాడినట్టు సమాచారం. అవినాష్ రెడ్డిని లొంగిపోవాల్సిందిగా చెప్పాలంటూ ఎస్పీతో సీబీఐ కోరినట్టు తెలుస్తుంది. శాంతి భద్రతల నేపథ్యంలోనే సీబీఐ ఆలోచిస్తున్నటుగా కనిపిస్తుంది.

అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వస్తున్న వార్తలపై వైసీపీ కార్యకర్తలు, అవినాష్ రెడ్డి అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. సీబీఐ (CBI) కి వ్యతిరేఖంగా నినాదాలు చేస్తున్నారు. ఇక ఆందోళన కారులను పోలీసులు దూరంగా తరిమేస్తున్నారు. ప్రస్తుతం కర్నూల్ విశ్వభారతి ఆస్పత్రి వద్ద హైటెన్షన్ నెలకొంది.

Read More: Priyanka Gandhi – Medak : త్వరలో ప్రియాంకాగాంధీ సభ.. ఎక్కడంటే?