Site icon HashtagU Telugu

Chitra Ramakrishna: ఎన్‌ఎస్‌ఈ కేసులో మాజీ ఎండీ చిత్రా రామకృష్ణ అరెస్ట్

660099

660099

కోలోకేష‌న్ కేసులో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) మాజీ సీఈవో, ఎండీ చిత్రా రామకృష్ణ ను సీబీఐ ఆదివారం అరెస్టు చేసింది. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన కీలక సమాచారాన్ని ముందుగానే యాక్సెస్ చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించ‌డంతో పాటు ఆమెపై మ‌రికొన్న‌ ఆరోపణలు ఉన్నాయి. ఇదివరకే ఆమెపై దేశం విడిచి వెళ్లకుండా లుక్‌ఔట్‌ నోటీసులు జారీ అయ్యాయి. ఆమెతో పాటు మరో మాజీ సీఈవో రవి నారాయణ్, మాజీ సీవోవో ఆనంద్‌ సుబ్రహ్మణ్యం దేశం విడిచి వెళ్లకుండా ఇటీవల లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆమె ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా కోర్టు తిర‌స్క‌రించింది. అయితే ఆ మ‌రుస‌టి రోజే ఆమెను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.

విచారణ అనంతరం చిత్రా రామకృష్ణను అరెస్టు చేశామ‌ని..వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం సీబీఐ ప్ర‌ధాన కార్యాల‌యంకి త‌ర‌లించామ‌ని సీబీఐ అధికారులు తెలిపారు. సోమవారం కోర్టులో హాజరుపరుస్తామని సీబీఐ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇంతకు ముందే చిత్ర రామకృష్ణతో సహా పలువురిని సీబీఐ ప్రశ్నించింది. గత మూడు రోజులుగా చిత్రా రామ‌కృష్ణా నివాసాలలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్రా రామకృష్ణ ఎన్ఎస్​ఈకి 2013 ఏప్రిల్​ నుంచి 2016 డిసెంబర్​ వరకు ఎండీ, సీఈఓగా బాధ్యతలు నిర్వహించారు.ఈ కేసులో చిత్ర రామకృష్ణను ప్రభావితం చేసిన గుర్తు తెలియని హిమాలయ యోగి పాత్రపై సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ హిమాలయ యోగి పాత్ర నిజమా, లేక కల్పితమా అనే అంశంపైనా సీబీఐ దర్యాప్తు చేస్తోంది.