Site icon HashtagU Telugu

Libya: బద్దలైన లిబియా డ్యామ్.. విశ్వరూపాన్ని చూపించిందిగా?

Libya

Libya

గత కొద్ది రోజులుగా ఆఫ్రికాలో వర్షాలు దంచి కొడుతున్న విషయం తెలిసిందే. వర్షాల దెబ్బకు రోజులన్నీ జలమయం అయ్యాయి. అంతేకాకుండా రోడ్లన్నీ కూడా నదులును తలపిస్తున్నాయి. కాగా ఆఫ్రికా లోని లిబియాలో డేనియల్‌ తుపాన్‌ జల ప్రళయం సృష్టించింది. అక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా వరదలు ముంచుకొచ్చాయి. కాగా ఈ వరదల తీవ్రతకు రెండు డ్యామ్‌లు బద్దలైపోయాయి. దీంతో దిగువ ప్రాంతాలకు వరద పోటెత్తి సమీపంలోని సముద్రంలోకి ప్రజలను లాక్కెళ్లింది. ఈ వరద కారణంగా నివాస ప్రాంతాలు మొత్తం అన్ని కూడా ఊడ్చిపెట్టుకుపోయాయి. భారీగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించింది.

భారీ వాహనాలు కూడా పడవల్లాగా నీటిలో తేలియాడుతూ ఎక్కడ చూసిన చెల్లచెదురుగా పడి ఉన్నాయి. ఈ ఉత్పాతంలో ఇప్పటికే 2000 మంది మరణించగా మరో 6,000 మంది ఆచూకీ గల్లంతైంది. ఈ విషయాన్ని లిబియా ఆర్మీ ప్రతినిధి అహ్మద్‌ మిస్మారి వెల్లడించారు. ఈ వరదల్లో దాదాపు మూడు భారీ వంతెనలు కూడా కొట్టుకుపోయాయి. సముద్ర తీరంలోని పర్వాతల వద్ద డెర్నా నగరం ఉంది. ఇక్కడ నివాస గృహాలు చాలా వరకు పర్వత లోయలో ఉన్నాయి. దీని సమీపంలోని ఒక డ్యామ్‌ బద్దలు కావడంతో ఈ నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లోకి ఒక్కసారిగా భారీగా బురద నీరు చొచ్చుకొచ్చింది. ప్రజలు తప్పించుకొనేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

Libya

ప్రస్తుతం ఇక్కడ కమ్యూనికేషన్‌ లైన్లు కూడా నిలిచిపోయాయి. దీంతో వరద ప్రాంతంలో పరిస్థితి ఏమిటో బయట ప్రపంచానికి తెలిసే అవకాశాలు కూడా అంతంత మాత్రమే. అయితే వాతావరణాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవడంతోనే ఈ ముప్పు వాటిల్లిందని లిబియా ఎమర్జెన్సీ అండ్‌ అంబులెన్స్‌ అథారిటీ చీఫ్‌ ఒసామా అల్యా వెల్లడించారు. సముద్ర మట్టం, వరద, గాలి వేగం వంటివి సరిగ్గా అధ్యయనం చేయలేదన్నారు. ఈ స్థాయి ముప్పును లిబియా గతంలో ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. తూర్పు తీరంలోని అల్‌ బైడ, అల్‌ మర్జ్‌, తుబ్రోక్‌, టాకెనిస్‌, బెంగ్‌హజి నగరాలు కూడా వరదలకు ప్రభావితం అయ్యాయి. లిబియాలోని తమ కార్యాలయం పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తోందని ఐరాస వెల్లడించింది. చాలా దేశాలు తమ సహాయక బృందాలను లిబియాకు తరలించాయి.

Exit mobile version