రేషన్ బియ్యం వద్దనుకుంటే కిలో రూ. 12లు చొప్పున ఖాతాల్లో వేయడానికి జగన్ సర్కార్ సిద్ధం అయింది. ఆ మేరకు కొన్ని జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కొత్తగా పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కారుమూరి నాగేశ్వరరావు గురువారం నాడు రేషన్ బియ్యంపై కీలక ప్రకటన చేశారు. రేషన్ బియ్యం కావాలనుకునే బియ్యాన్నే పంపిణీ చేస్తామన్నారు. బియ్యం వద్దనుకుంటే ఆ బియ్యం ఖరీదు మొత్తాన్ని నగదు రూపంలో అందజేస్తామని వెల్లడించారు. బియ్యం వద్దనుకునే వారి నుంచి డిక్లరేషన్ తొలుత తీసుకుంటారు. ఆ తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేస్తారు. ఆ ప్రతిపాదనపై ఓ డ్రాఫ్ట్ తయారైందని మంత్రి నాగేశ్వరరావు వెల్లడించారు. సీఎం జగన్ నుంచి ఆమోదం లభించిన వెంటనే ఈ పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. తొలుత మూడు మునిసిపాలిటీల్లో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తామని వివరించారు. ఫలితాలు ఆశించిన విధంగా వస్తే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
రేషన్ బియ్యం వద్దంటే..నగదు!

Minister Nageswara Rao Karumuri