Site icon HashtagU Telugu

Ananthapur : ఎస్పీ,అదనపు ఎస్పీ,డీఎస్పీలపై కేసులు నమోదు..!!

Anathapur Police

Anathapur Police

అనంతపురం ఎస్పీ ఫకీరప్ప, ఏఆర్ అదనపు ఎస్పీ హనుమంతు, సీసీఎస్ డీఎస్పీ మహబూబ్ బాషాలపై అనంతపురం టు టౌన్ పోలీసు స్టేషన్ లో ఈరోజు కేసు నమోదు చేశారు. సస్పెండ్ అయిన ఏఆర్ కానిస్టేబుల్ కె.భానుప్రకాష్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. సెక్షన్ 167, 177, 182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసులు నమోదయ్యాయి. ఇతర జిల్లా పోలీసు ఉన్నతాధికారిని నియమించి కేసును సమగ్రంగా విచారించి నివేదిక ఇవ్వాలని అనంతపురం రేంజ్ డీఐజీ రవిప్రకాష్ ఉత్తర్వులు జారీ చేశారు. డీఐజీ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందని సీఐ శివరాముడు తెలిపారు.

కాగా, దళితుడిననే చిన్నచూపుతో కుట్రపూరితంగా తనపై తప్పుడు విచారణ వాంగ్మూలం రికార్డు చేశారని, ఇందుకు బాధ్యులైన పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఏఆర్‌ కానిస్టేబుల్‌ ప్రకాష్ మంగళవారం అనంతపురం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై రాంప్రసాద్‌కు అందించిన ఫిర్యాదు ప్రకారం గార్లదిన్నె పోలీస్‌స్టేషన్‌లో 2019లో ప్రకాష్ పై నమోదైన ఓ కేసు కోర్టులో నడుస్తుండగానే పోలీసు శాఖ విచారణ చేపట్టింది. ప్రస్తుత సీసీఎస్‌ డీఎస్పీ మహబూబ్‌ బాషా, ధర్మవరం డీఎస్పీ రమాకాంత్‌, సీఐలు కృష్ణారెడ్డి, విజయభాస్కర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో విచారణ జరిగింది.

బాధితురాలు బి.లక్ష్మి కానిస్టేబుల్‌ ప్రకాష్‌కు రూ.10 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు ఇవ్వలేదని చెప్పినా విచారణాధికారులు ఆమె వాంగ్మూలాన్ని మార్చేశారని ప్రకాష్ ఫిర్యాదు చేశారు. నేరం రుజువైందని వారే నిర్ణయించుకుని తనను ఉద్యోగం నుంచి తొలగించారని పేర్కొన్నారు. తాను దళితుడిననే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. తనపై రిపోర్టు రాసిన ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, విచారణ జరిపిన ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలు, డిస్మిస్‌కు ఆదేశాలిచ్చిన ఎస్పీ ఫక్కీరప్పపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేసి న్యాయం చేయాలని కోరారు.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version