Viral Fevers : హైదరాబాద్‌లో పెరుగుతున్న వైర‌ల్ ఫీవ‌ర్స్

తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికున్‌గున్యా,

  • Written By:
  • Updated On - July 15, 2022 / 12:17 PM IST

తెలంగాణలో ఎడతెరిపి లేని వర్షాలు, చలిగాలుల నేపథ్యంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాల్లో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, చికున్‌గున్యా, డయేరియాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోంది. అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు, దోమల బెడద, చలిగాలుల వల్ల ప్రజలు ఈ వ్యాధుల బారిన పడుతున్నారని జీహెచ్‌ఎంసీ పరిధిలోని వైద్యులు తెలిపారు. వరదలు సంభవించే జిల్లాల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వైద్యులకు, ఆరోగ్య సిబ్బందికి ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తలనొప్పి, ఒళ్లు నొప్పులు, జ్వరం, వాంతులు, కళ్లు తిరగడం వంటి సమస్యలతో రోగులు తమ దవాఖానలకు వస్తున్నారని ప్రైవేటు వైద్యులు చెబుతున్నారు. వీరిలో ఎక్కువ మంది డెంగ్యూ, టైఫాయిడ్ చికున్‌గున్యా, మలేరియా, డయేరియాతో బాధపడుతున్నట్లు పరీక్షల అనంతరం తేలింది.

వర్షాకాలంలో నీరు కలుషితమై అనేక రోగాల బారిన పడే అవకాశం ఉన్నందున ప్రజలు తాగే ముందు నీటిని మరిగించాలని వైద్యులు సూచించారు. నీటిని మరిగించడం ద్వారా ఈ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చునని వైద్యులు తెలిపారు. అలాగే రోడ్డు పక్కన ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తెలంగాణలో టైఫాయిడ్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైద్యారోగ్య శాఖ అధికారులు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఇళ్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రజలు అనేక వ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం వంటి సమస్యలతో వైద్యులను సంప్రదించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రజలు తమ ఇళ్లలో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ విషయంలో జీహెచ్‌ఎంసీ తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.