అమెరికాలోని బ్లేయన్ పట్టణం పరిధిలో ఉన్న హైవే పై అకస్మాత్తుగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఎడమవైపునున్న సబ్ వే నుంచి వేగంగా దూసుకొస్తున్న కారు అదుపు తప్పి, రాంగ్ రూట్ లోకి ప్రవేశించింది. హైవేపై నుంచి వేగంగా వెళ్తున్న ఒక ట్రక్కును ఢీకొట్టింది. దీంతో అదుపు కోల్పోయిన ట్రక్కు .. రోడ్డు పక్కనున్న సైడ్ వాల్ పైకి దూసుకెళ్లింది. దీంతో ట్రక్కులోని ఇంధనం లీకై మండటంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి.
మరుక్షణమే ఆ ప్రాంతాన్ని నల్లటి పొగ దుప్పటిలా కప్పేసింది. హమ్మయ్య.. తృటిలో గండం నుంచి గట్టెక్కామని ఇతర వాహనదారులు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఈ రోడ్డు ప్రమాద వీడియో ఇప్పుడు అమెరికా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొసమెరుపు ఏమిటో తెలుసా.. మంటల్లో చిక్కుకున్న ట్రక్కు డ్రైవర్, ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ ఇద్దరూ సురక్షితంగా వాహనాల నుంచి బయటపడ్డారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.