Kerala: కారు ఓనర్ కు హెల్మెట్ లేదంటూ రూ.500 జరిమానా

కారు నడుపుతున్న వ్యక్తికి హెల్మెట్ లేదంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.500 ఫైన్ వేశారు.

  • Written By:
  • Updated On - April 27, 2022 / 12:55 PM IST

కేరళలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. కారు నడుపుతున్న వ్యక్తికి హెల్మెట్ లేదంటూ ట్రాఫిక్ పోలీసులు రూ.500 ఫైన్ వేశారు. అసలు కారును డ్రైవ్ చేస్తున్నవారికి హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరమేంటి? సగటు వ్యక్తికి వచ్చే ప్రశ్న ఇది. కానీ ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. ఇదేమీ ఆలోచించకుండా.. చలానా రాసేశారు. దీంతో ఆ కారు ఓనర్.. ఈ పొరపాటు గురించి చెప్పడానికి అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఎ.అజిత్ కు మారుతి ఆల్టో ఉంది. ఆయనకు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఈ రూ.500 చలానా వచ్చింది. హెల్మెట్ లేకుండా మోటార్ సైకిల్ నడిపినందుకు ఈ జరిమానా విధిస్తున్నాం అని అందులో ఉంది.

2021 డిసెంబర్ 7వ తేదీతో ఈ చలానా వచ్చింది. ఇద్దరు వ్యక్తులు హెల్మెట్ లేకుండా మోటారు సైకిల్ పై వెళ్లినందుకు ఆ చలానా రాశారు. కానీ అందులో వాహనం కేటగిరీలో మోటారు కారు అని రాశారు. పైగా ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్ అజిత్ దగ్గరున్న మారుతీ ఆల్టోది. నిజానికి పోలీసులు మోటార్ బైక్ నే ఫోటో తీసుకున్నారు. ఆ ఇమేజ్ ను కూడా చలాన్ కు అటాచ్ చేశారు. అయితే నెంబర్ చూస్తే మాత్రం మోటార్ బైక్ ది కాకుండా కారుది వేశారు. అంటే చివరి రెండు అంకెలు 77 వేయడానికి బదులుగా 11 వేశారు. దీంతో ఆ చలాన్ అజిత్ కారుకు వచ్చింది. నిజానికి ఈ పొరపాటు ట్రాఫిక్ అధికారులదే.

కానీ తన బండిపై చలాన్ రావడంతో ఇప్పుడు ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి అజిత్ అధికారులను పదే పదే కలవాల్సి వస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై అజిత్ ఫిర్యాదు చేస్తానన్నాడు. పోలీసు అధికారులు మాత్రం.. నెంబర్ ను పొరపాటుగా సిస్టమ్ లో ఎంటర్ చేయడం వల్ల ఈ తప్పిదం జరిగిందన్నారు. అంతేకాని కావాలని చేసింది కాదన్నారు. మొత్తానికి ట్రాఫిక్ పోలీసుల తప్పిదానికి అజిత్ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ నెటిజన్లు మాత్రం దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు.