నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్‌కు విధేయుడినని తెలిపారు. వైసీపీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ జెండా భుజాన వేసుకుని కష్టపడ్డానన్నారు. సీఎం గురించి, పార్టీ గురించి ఎప్పుడూ పొరపాటు మాట్లాడలేదని పేర్కొన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్నా తనను అనుమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొద్దిసేపట్లో ఫోన్ ట్యాపింగ్ గురించి ఆధారాలు బయటపెడతానని తెలిపారు.
తన జీవితంలో వైసీపీకి వ్యతిరేకంగా ఇలాంటి ప్రెస్‌మీట్ పెడతానని తాను అనుకోలేదని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వెల్లడించారు. ‘పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎంతో పోరాడాను. పార్టీ అధికారంలోకి వచ్చాక గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదు. వైసీపీపై నేనెక్కడా ఒక్క మాట కూడా పొరపాటున మాట్లాడలేదు. నేనెప్పుడూ జనంతోనే ఉన్నాను. నా ఫోన్ ట్యాప్ చేయడం బాధాకరం’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: TTD : శ్రీవారి ఆలయంలో మరోసారి బయటపడ్డ భద్రతావైఫల్యం..మాఢ వీధుల్లో..?
అవమానాలు ఎదురైనా పార్టీ కోసం కష్టపడిన తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఓ ఉన్నతాధికారి తనకు స్వయంగా చెప్పారని, ఇటీవల దీనిపై తనకు సాక్ష్యమూ దొరికిందన్నారు. తన ప్రోగ్రాంలలో ఇంటలిజెన్స్ సిబ్బంది పాల్గొంటున్నట్లు గుర్తించానన్నారు. దీంతో అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయనని ప్రకటించారు. మరోవైపు.. నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పార్టీ అధిష్టానం చెక్ పెట్టనుంది. నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం కొత్త ఇంఛార్జ్‌గా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించనుంది. ఈ రోజు మధ్యాహ్నం అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. అయితే తన ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రానికి ఫిర్యాదు చేస్తానని కోటంరెడ్డి హెచ్చరిస్తున్నారు.