Site icon HashtagU Telugu

Canada: ఉత్తర అమెరికాను అతలాకుతులం చేస్తున్న కార్చిచ్చు.. దెబ్బకు నగరం మొత్తం ఖాళీ?

Canada

Canada

కార్చిచ్చు డెబ్బకు ప్రస్తుతం కెనడాను గజగజా వణికిపోతోంది. అంతేకాకుండా కార్చిచ్చు దెబ్బకు ఓ నగరమే ఖాళీ అవుతోంది. రేపటి కల్లా అనగా శుక్రవారం మధ్యాహ్నం లోపు అక్కడున్న ప్రజలంతా వెళ్లిపోవాలని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలను కూడా జారీ చేసింది. కాగా కెనడా లోని నార్త్ వెస్ట్ టెర్రిటరీస్ రాజధాని ఎల్లోనైఫ్ నగరం వైపు కార్చిచ్చు దూసుకొస్తోంది. దాంతో వెంటనే ప్రజలంతా ఖాళీ చేయాలంటూ స్థానిక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆ దావానలం పదుల కిలోమీటర్ల దూరంలో ఉందని, ఈ వారాంతంలో ఎల్లోనైఫ్ శివార్లను సమీపిస్తుందని పేర్కొంది.

ఆ నగరంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఒకవేళ మీరు ఇక్కడే ఉండాలనుకుంటే.. మీతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేసినట్లే అంటూ అప్రమత్తం చేసింది. కాగా ఎల్లోనైఫ్ నగరంలో 20 వేల మంది నివసిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా గురువారం మధ్యాహ్నం నుంచి ప్రజలను తరలించేందుకు విమానాలు అందుబాటులో ఉంటాయని ఆ నగర మేయర్ తెలిపారు. అందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశించామని అన్నారు. కాగా ఇది ప్రతి ఒక్కరికీ అత్యంత క్లిష్ట సమయం. వీలైనంత వరకు ఒకరికొకరు సాయం చేసుకోండి. మీ వాహనంలో ఖాళీ ఉంటే ఇతరులను ఎక్కించుకోండి అని అదికారులు కోరారు.

అలాగే మూడు వేలమంది జనాభా కలిగిన హే రివర్‌ పట్టణంలో కూడా తరలింపు ప్రక్రియ జరుగుతోంది. బలమైన గాలుల కారణంగా అది వేగంగా వ్యాపిస్తోందని అధికారు వెల్లడించారు. అలాగే పరిసర ప్రాంతాల్లో పొగ అలుముకున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. కొద్దిరోజుల క్రితం హవాయి దీవుల సమూహంలోని లహైనా రిసార్టు నగరంలో దావానలం వ్యాపించింది. గతవారం అది సృష్టించిన విలయానికి 100 మందికి పైగా మృతి చెందారు. వేల సంఖ్యలో నివాసాలు, ఇతర భవనాలు కాలిబూడిదయ్యాయి. వందల సంఖ్యలో జంతువులు మంటల్లో కాలిపోయాయి.