Site icon HashtagU Telugu

Kiran Kumar Reddy: ఏపీసీసీ అధ్యక్షుడిగా కిరణ్ కుమార్ రెడ్డి?

KiranKumar Reddy

Kiran Kumar Reddy

కాంగ్రెస్ అధిష్టానం మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని దేశ రాజధాని ఢిల్లీకి పిలిపించింది. ఢిల్లీలో ఆయన పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం తీసుకొచ్చేందుకు ఆయన్ను ఏపీసీసీ అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన సొంత పార్టీని ప్రారంభించడంతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ మనుగడ కోసం కష్టపడుతోంది. విభజన తర్వాత పార్టీ తీవ్రంగా నష్టపోయింది. జగన్ మోహన్ రెడ్డి పార్టీని నెత్తిన పెట్టుకుంటే.. కిరణ్ కుమార్ రెడ్డి విభజన సమయంలో పార్టీని సమాధి చేశారు.

ఉభయ కమ్యూనిస్టు పార్టీల కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ బలహీనంగా ఉంది. కాంగ్రెస్ కంటే జనసేన కూడా మెరుగైన స్థానంలో ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కమ్యూనిస్టులు, జనసేన కొన్ని వార్డు మెంబర్లను గెలుచుకోగా.. కాంగ్రెస్ ఎక్కడా కనిపించలేదు. ఎన్ రఘువీరా రెడ్డి నిష్క్రమణ తర్వాత పార్టీ పునరుద్ధరణపై ఆశ లేకుండా పోయింది. తమిళనాడులో పార్టీ అత్యల్ప స్థానానికి దిగజారడానికి రెండు దశాబ్దాలు పట్టినా.. ఒక దశాబ్దం లోపే ఆంధ్రప్రదేశ్‌లో బలహీనమైంది. కాంగ్రెస్ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అస్తిత్వం కోసం తీవ్రంగా ఆరాట ప‌డుతోంది. పార్టీ ఇప్పుడు పునర్ వైభవం కోసం కిరణ్ కుమార్ రెడ్డి వైపు చూస్తోంది. పార్టీని అప్రతిష్ట పాలు చేసిన వ్యక్తి ఇప్పుడు కొత్త ఊపిరి పీల్చుకునేలా చేస్తాడా అనేది వేచి చూడాల్సిందే.