Byjus Employee : కన్నీటి పర్యంతం అయిన బైజుస్ ఉద్యోగిని.. బలవంతంగా రాజీనామా చేయించారంటూ?

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్ గత కొద్ది రోజులుగా వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాడులు, లేఆఫ్‌ సమస్యలతో కొన్ని నెలలుగా సతమతమవుత

  • Written By:
  • Publish Date - July 28, 2023 / 03:40 PM IST

ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్ గత కొద్ది రోజులుగా వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈడీ దాడులు, లేఆఫ్‌ సమస్యలతో కొన్ని నెలలుగా సతమతమవుతున్న ప్రముఖ ఎడ్‌టెక్‌ కంపెనీ బైజూస్‌ తాజాగా మరొకసారి వార్తల్లో నిలిచింది. బైజూస్ కంపెనీలో లేఆఫ్‌కు గురైన ఒక ఉద్యోగి బైజూస్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఉద్యోగులు, కస్టమర్లను కంపెనీ మోసగిస్తోందని ఆరోపించిందని, అంతే కాకుండా తనతో బలవంతంగా రాజీనామా చేయించారనితనకు రావాల్సిన బకాయిలు కూడా చెల్లించలేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోని విడుదల చేసింది.

ఆకాంక్ష ఖేమ్కా అనే ఆమె ఏడాదిన్నర పాటు బైజూస్‌లో అకడమిక్‌ స్పెషలిస్ట్‌గా పనిచేసింది. ఇటీవల ఆమె పేరును లేఆఫ్‌ జాబితాలో చేర్చారు. అయితే, కారణం లేకుండా తనను ఉద్యోగం నుంచి తొలగించడంపై ఆకాంక్ష మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే లింక్డ్ఇన్‌ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే రాజీనామా చేయాలని వారు నాకు లేఖ పంపారు. లేదంటే వేతనం చెల్లించబోమని బెదిరించారు. నా వేరియబుల్స్‌, ఇతర చెల్లింపులు కూడా చేయలేదు. నా కుటుంబానికి ఇప్పుడు నేను ఆధారం. నా భర్తకు ఆరోగ్యం సరిగా లేదు. లోన్‌లు చెల్లించాలి. జీతం, బకాయిలు ఇవ్వకపోతే నేను ఎలా బతకాలి?అని ఆమె కన్నీటి పర్యంతం అయ్యింది.

ఈ క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేందుకు నాకు ప్రభుత్వం నుంచి సాయం కావాలి. లేదంటే చావు తప్ప మరో మార్గం లేదు. నేను స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే నా జీతం నాకు రాదు. దయచేసి సహాయం చేయండి. ఇక ఈ విషపూరిత పని విధానం నుంచి బయటపడేలా మిగతా ఉద్యోగులకు కూడా సాయం చేయాలని కోరుతున్నాను. బైజూస్‌ అనేక మోసాలకు పాల్పడుతోంది. కస్టమర్లు, ఉద్యోగులను కూడా మోసగిస్తోంది అని ఆమె ఆరోపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.