Bus Fire: కూకట్‌పల్లిలో బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం!

హైదరాబాద్ కూకట్‌పల్లిలో పెను ప్రమాదం తప్పింది. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్‌లో కావేరి ట్రావెల్స్‌ బస్సులో మంటలు చెలరేగాయి.

Published By: HashtagU Telugu Desk
Bus Fire

Bus Fire

హైదరాబాద్ కూకట్ పల్లిలో బస్సు దగ్ధమైంది. జేఎన్ టీయూ బస్టాండ్ వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో నుంచి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. బస్సులో మంటలు ఆర్పేశారు. రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తగ్గిన తర్వాత ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

మంటలు చెలరేగిన సమయంలో బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. మెట్రో స్టేషన్ కిందే బస్సు మంటల్లో చిక్కుకోవడం ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడటంతో చుట్టపక్కల వారు భయంతో పరుగులు తీశారు. మంటలు చెలరేగిన వెంటనే అప్రమత్తమైన కొంత మంది స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో బస్సులో డ్రైవర్, క్లీనర్ మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. వారు కూడా మంటలు చెలరేగగానే కిందకి దిగేశారు.

బస్సులో నుంచి మంటలు ఎగసిపడటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అటుగా వచ్చే వాహనాలను చాలా సేపు నిలిపివేశారు. మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చిన తర్వాతే వాహనాలను అనుమతించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే బస్సులో మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని పోలీసులు చెప్పారు.

  Last Updated: 08 Jan 2023, 09:54 AM IST