Deshapathi Srinivas : సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అంశంపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ ప్రభుత్వంపై, ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనలను విస్మరించి, నిన్న తీసుకున్న నిర్ణయాలపై వారు సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో చేసిన ప్రకటనలు కేవలం మాయమాటలేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
గేమ్ చేంజర్ మినహాయింపులపై ప్రశ్నలు
గేమ్ చేంజర్ సినిమా టికెట్ల రేట్ల పెంపు, బెనిఫిట్ షోల అనుమతులపై బీఆర్ఎస్ నేత, మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నలు వేశారు. “తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపు ఉండదని, బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని అసెంబ్లీలో చెప్పారు. కానీ దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ సినిమాకు ప్రత్యేక మినహాయింపులు ఎందుకు?” అని నిలదీశారు. ఆరు గ్యారంటీలపై ఇచ్చిన హామీలు మాట తప్పినట్లే, సినిమా టికెట్ల విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఆరోపించారు.
Nidhhi Agerwal : పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఫిర్యాదు
తెలంగాణ కల్చర్ అవమానించడంపై ఆగ్రహం
ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ కూడా దిల్ రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. “తెలంగాణ ఉద్యమంలో దిల్ రాజు ఎక్కడా పాల్గొనలేదని, తెలంగాణ ప్రజలకు ఏనాడూ మద్దతు ఇవ్వలేదని” స్పష్టంగా చెప్పారు. ఇటీవల నిజామాబాద్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ కల్చర్‌ను అవమానించేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. “తెలంగాణలో వైబ్ లేదని, ఆంధ్రాలో మాత్రం సినిమాలకు మంచి వాతావరణం ఉందని చెప్పడం, ఇక్కడి ప్రజల గౌరవాన్ని దిగజార్చే ప్రయత్నం” అన్నారు.
తెలంగాణలో సినిమాలు విడుదల చేయడం మానుకోవాలని దిల్ రాజుకు హితవు పలికిన దేశపతి శ్రీనివాస్, సీఎం రేవంత్ రెడ్డి టికెట్ల రేట్లు పెంచడానికి దిల్ రాజుకు అనుకూలంగా ఆదేశాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి రెండు నాలుకల ధోరణిని మరోసారి బయటపెట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. “ప్రజల సమస్యలను దూరం చేసి, తప్పుడు రాజకీయాలకు సమయాన్ని వృథా చేస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజలు తగిన బుద్ధి చెబుతారు” అని నేతలు వ్యాఖ్యానించారు.