KTR : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్). అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి కారణాలు విశ్లేషిస్తూ, “అతి విశ్వాసం , కొన్ని చిన్న తప్పిదాల వల్ల మా పార్టీకి ఈ ఫలితాలు వచ్చాయి. కానీ, కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ రాష్ట్రాన్ని, దేశాన్ని శాసించే రోజులు వస్తాయి,” అని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్.
కేటీఆర్ మాట్లాడుతూ, “ఎన్నికలు ముగిసి ఏడాది అయినా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద జపం చేస్తూనే ఉంది. రాష్ట్రం దివాలా తీసిందని మాట్లాడటం ముఖ్యమంత్రికి పరిపాలనపై అనుభవం లేకపోవడం, చాతన లేకపోవడం స్పష్టంగా చూపిస్తుంది,” అని విమర్శించారు. అలాగే, “ముఖ్యమంత్రికి, మంత్రులకు సత్సంబంధాలు లేవు. అంతర్గత విభేదాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును దెబ్బతీస్తున్నాయి,” అని ఆరోపించారు.
ఆర్థిక పరిస్థితులపై విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ అప్పులపై తప్పుడు ప్రచారం చేస్తోందని, నిజానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రూ. 4 లక్షల కోట్లు అప్పులు చేశాకే రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. “కానీ, కేవలం ఏడాదిలోనే కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 1.3 లక్షల కోట్లు అప్పులు చేసింది. దీనిపై ప్రశ్నలు ఎదుర్కోవాల్సిన అవసరం కాంగ్రెస్ నాయకత్వానికి ఉంది,” అని అన్నారు. ఢిల్లీకి తెలంగాణ కాంగ్రెస్ ATMగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చోడి చేతిలో రాయి అయ్యిందని తీవ్రంగా విమర్శించారు.
తనపై ఆరు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపే ప్రయత్నం చేసిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. “కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై మేము నిలదీయాల్సిన అవసరం ఉంది. హామీలు అమలు చేయకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ముందే చెప్పాను. కానీ, ఆ హామీల అమలు దిశగా కనీసం మొదటిపడిక కూడా పడలేదు,” అని ఆయన అన్నారు. రైతుల సంక్షేమం అంశం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి వైఫల్యాన్ని చవిచూస్తోందని, “రైతు బంధు పథకాన్ని దెబ్బతీయడానికి కుట్రలు జరుగుతున్నాయి. రైతుల్ని దొంగలుగా చిత్రీకరించే విధంగా పనిచేస్తున్నారు. మేం 12 విడతల్లో రూ. 80,000 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏమి చేసింది?” అని ప్రశ్నించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై వివాదం
కాళేశ్వరం ప్రాజెక్టు పగుళ్లపై విమర్శలు చేయడం కాంగ్రెస్ కుట్రలో భాగమేనని కేటీఆర్ ఆరోపించారు. “మేడిగడ్డకి నీరు అందకపోవడం కాదు, రేవంత్ రెడ్డి మేధస్సుకే పగుళ్లు పడ్డాయి. కాళేశ్వరంను బాగు చేయడానికి కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు, ఎందుకంటే దానివల్ల కోటిన్నర ఎకరాలకు నీరు అందించాల్సి ఉంటుంది. ఇది రైతులకు మేలు చేస్తుందని వాళ్లకు తెలియదా?” అని కేటీఆర్ ప్రశ్నించారు.
హామీల అమలుపై ప్రశ్నలు
“ఆరు గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా అమలులో లేదు. రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు చేస్తామని చెప్పి ఇప్పుడు కనీసం అరశాతం కూడా చేయలేదు. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల రెగ్యులర్ పరచడం గురించి ప్రభుత్వం మౌనం వహిస్తోంది. కళ్యాణలక్ష్మీ పథకం కింద నలుగురు లక్షల పెళ్లిళ్లు జరిగినా నిధులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమైంది,” అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆఖరి మాట
కేటీఆర్ మాట్లాడుతూ, “సాతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తెలంగాణ అభివృద్ధి సాధ్యపడదు. ప్రజలు ఇలాంటి నాయకత్వాన్ని ప్రశ్నించాలి. బీఆర్ఎస్ పునఃనిర్మాణం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలతో మళ్లీ ప్రజలకు దగ్గరవుతుంది. కాంగ్రెస్ హామీలను నిలదీసే దిశగా మా పోరాటం కొనసాగుతుంది,” అని స్పష్టం చేశారు.
Emerald: ఆకుపచ్చ రత్నం ఎప్పుడు ధరించాలి.. ఎవరు ధరించాలో మీకు తెలుసా?