Dasoju Sravan: సీఎం రేవంత్ కు దాసోజు బహిరంగ లేఖ

  • Written By:
  • Updated On - December 22, 2023 / 05:31 PM IST

Dasoju Sravan: రేవంత్ సర్కారు ఇటీవల అసెంబ్లీ సెషన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వ లోపాలపై శ్వేతపత్రం విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సీఎం రేవంత్ నిర్ణయంపై ఒకవైపు హర్షం వ్యక్తం చేస్తుండగా, మరోవైపు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లీడర్ దాసోజు సీఎం రేవంత్ కు బహిరంగ లేఖ ను సంధించారు.

లేఖలో ఏముందంటే

‘‘కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు మీ ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకు? కేవలం పత్రికా సమావేశాలు నిర్వహించి సదరు పత్రాలు విడుదల చేస్తే ప్రజలకు తెలియదా? ప్రతిపక్షాలు వాటికి సమాధానం ఇవ్వరా? తప్పు జరిగితే విచారణలకు ఆదేశించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావాల్నా ఆలోచించండి.

ఇదంతా ఒక సినిమా ఫక్కీలో అతి ఆర్భాటంగా తప్పుడు లెక్కలతో శ్వేత పత్రాలు విడుదల చేయడం వెనుక కేవలం కెసిఆర్ గారి గత ప్రభుత్వాన్ని బదనాం చెయ్యాలన్నటువంటి యొక్క దుగ్ద తప్ప తెలంగాణ భవిష్యత్తు నిర్మాణానికి, ప్రజల అభివృద్ధికి పునాదులు వెయ్యాలనిసంకల్పం మాత్రం ఉన్నట్లుగా లేదు

మీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 39% ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ 37% ఓట్లతో ప్రతిపక్షంలో కూర్చుంది. ఎన్నికల సందర్భంలో ఏఐసీసీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు మరియు శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారు, డీకే శివకుమార్ గారు మరియు మీతో సహా అనేక మంది అనేక వాగ్దానాలు చేశారు. యూత్ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, ఎస్ సి, ఎస్ టి డిక్లరేషన్, మహిళా డిక్లరేషన్, మైనారిటీ డిక్లరేషన్ దానితో పాటు ఆరు గ్యారెంటీలు, మరియు విస్తృతమైన మేనిఫెస్టో, మార్పు అనే నినాదాలతో అందమైన కలను చూపిస్తూ మీరంతా ప్రచారం చేస్తే, మీ వాగ్దానాలను నమ్మి మీ పథకాలను చూసి, నచ్చి మెచ్చిన ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు.

బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన మొదటి రోజే బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు విన్నవించిన విషయం ఏంటంటే నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసేందుకు మా వంతు సహాయ సహాకారాలను అందిస్తామని. తెలంగాణ అభివృద్ధి ప్రస్థానాన్ని మాత్రం ఇంకా ద్విగుణీకృతం చేసే విధంగా ఉండాలని ఒక ప్రతిపక్ష పార్టీగా కోరుకున్నారు.

కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండో రోజు నుండి బట్టకాల్చి మీద వేసే రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ఎన్నికల ముందు అన్ని స్థాయిలలో మీ నాయకులు తెలంగాణ 6 లక్షల కోట్ల అప్పులు అయ్యాయని పదే పదే ప్రచారం చేశారు. అంటే తెలంగాణ అప్పుల సంగతి ముందే తెలుసు కదా.. సరే అప్పుల చిట్టాను ప్రస్తావించిన మీరు, తెలంగాణ కెసిఆర్ గారి ప్రభుత్వం సృష్టించిన ఆస్తుల చిట్టాను మాత్రం బయట పెట్టలేదు. కెసిఆర్ గారి నేతృత్వంలో గత ప్రభుత్వం సంపద సృష్టించి, సంపద పెంచినటువంటి విషయాలను ప్రస్తావనకు తీసుకురాకుండా ఏకపక్ష శ్వేత పత్రాల పేరు మీద ప్రజలను మభ్యపెట్టేందుకు మసిపూసి మారేడుకాయను చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు వచ్చే ఉపయోగం ఏంటో దయచేసి చెప్పండి. మీ శ్వేతపత్రాలలో ఉన్న అంశాలు అన్ని కూడా గత ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రవేశ పెట్టిన బడ్జెట్లలో, సిఏజి ఆడిట్ రిపోర్టులలో ఉన్న అంశాలే, ప్రజలకు ప్రభుత్వ వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నవే. కొత్తగా మీరు ఏదో కనుక్కున్నట్లు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి అప్పుల లెక్క చెప్పడం కేవలం గత ప్రభుత్వంపై కక్ష సాధింపు ధోరణి కనిపిస్తుంది.

కొత్తగా అధికారంలోకి వచ్చిన మీరుమొదటిసారిఅసెంబ్లీ సమావేశాలు నిర్వహించేటప్పుడు భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికల గురించి కానీ భవిష్యత్ అభివృద్ధి పాలసీల గురించి కానీ చర్చించి ప్రజలకు భవిష్యత్తుపై భరోసా కల్పించాల్సింది పోయి, గత ప్రభుత్వాలు ఇట్ల చేసినయ్ అట్ల చేసినయ్ అంటూ అంటూ శ్రీ కేసీఆర్ గారిపై ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది అనుకుంటే మీ విజ్ఞతకు వదిలేస్తున్నాం.

ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా నన్ను బాధించిన ముఖ్యమైనఅంశం, ఆర్థిక పరిస్థితుల మీద మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలోని మూడవ చాప్టర్ఇదిముమ్మాటికీఉద్యమసమయంలోతెలంగాణఏర్పాటునువ్యతిరేకించినఆంధ్రనాయకులఆలోచనావిధానం.అందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నపుడే, తెలంగాణ అభివృద్ధి చెందిందనే భావన చొప్పించడం, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచినట్టు, తెలంగాణ అస్థిత్వాన్ని కించపరిచినట్టు, తెలంగాణ అమరవీరుల త్యాగాలను కించపరిచినట్టు అనే విషయాన్ని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, కేబినెట్లో ఆశీనులైన గౌరవ మంత్రివర్గ సభ్యులు దయచేసి గుర్తించాలి. ఆంధ్ర పాలకుల అణచివేతకు, వారి అన్యాయానికి వ్యతిరేకిస్తూ, తెలంగాణ సాధన కోసం యావత్తు తెలంగాణ ప్రజలు ఏళ్లతరబడి ఉద్యమాలు చేసిండ్రు, అనేక పోరాటాలు చేసిండ్రు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. కానీ మీ ప్రభుత్వ దృష్టిలో అప్పటికే తెలంగాణ అంత అభివృద్ధి చెందింది అని భావిస్తే తెలంగాణను ఎందుకు ఇచ్చిండ్రు. ఒకవేళ అన్ని రకాలుగా తెలంగాణ బాగుంటే శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటుకై సానుకూలంగా ఎందుకు తోడ్పడ్డారు.

మీ శ్వేత పత్రాలన్నీ కేవలం తెలంగాణ వ్యతిరేక ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పెట్టుబడిదారులు మరియు తెలంగాణ ద్రోహులు అంత కూడగట్టుకొని తెలంగాణ రాకముందే అంతా బాగుంది అనే భావన సృష్టించి, శ్రీ కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సాధించిన విజయాలు కావచ్చు, సమకూర్చిన ప్రజాసంపద కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కావచ్చు, భవిష్యత్ తరాల కోసం అయన వేసినటువంటి అభివృద్ధి పునాదులు కావచ్చు, వాటినన్నింటిని కూడా కావాలని విస్మరించికొమ్మమీద కూర్చొని, కొమ్మను నరుక్కున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. దయచేసి మీరు కేసీఆర్ మీద అక్కసుతో బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా మీరు చేస్తున్నటువంటి దుష్ప్రచార పర్యవసానం భవిష్యత్ పారిశ్రామిక పెట్టుబడులకు విఘాతం కలిగే ప్రమాదం ఉంది. కెసిఆర్ గారి విజినరీ పాలన వల్ల అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ, భారతదేశానికి తెలంగాణ తలమానికంగా ఏర్పడి పెట్టుబడులకు మరియు సకల శాంతిభద్రతతో దేశ విదేశస్తులకు నివాసానికి స్వర్గధామంగా మారింది అనే విషయాన్ని గుర్తించండి.

ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. గతం కంటే మంచి ప్రజారంజక పరిపాలన అందించండి. కానీ శ్వేత పత్రాల పేరుతో మీరు చేస్తున్న బదనాం వల్ల, రాష్ట్రం అప్రతిష్ట పాలైంది. మీ వైఖరి ఇలాగె కొనసాగితే, రాష్ట్రానికి భవిష్యత్తులో ఏ విదేశి పెట్టుబడిదారులు రాష్టం వైపు కన్నెత్తి చూడకుండా ఉండే ప్రమాదం ఉంది. మీకు అప్పులు ఉన్నాయని మీ తమ్ముడో అన్నో ఊర్లో ప్రచారం చేస్తే మీకు అప్పు పుడతదా? ఇది అంతే. ప్రజలకు తెలిసే మీరు బాగుచేస్తారని మీకు అధికారం ఇస్తే శ్వేత పత్రాల పేరుతో కాలయాపనా చేయడం బట్ట కాల్చి మీద వేయడం మీ హస్వదృష్టికి నిధర్శనం.

మీరు వాగ్దానాలు చేసినప్పుడు ఈ అప్పులు లేవా? ఇవాళ మీ కొత్త వాగ్దానాలు అమలు చేయడానికి విధివిధానాలను రూపొందించాల్సిన సమయంలో అప్పుల గురించి మాట్లాడుతున్నారు అంటే, మీరు మీ వాగ్ధానాలను విస్మరిస్తారా లేక ఇది సాకుగా చూపిస్తూ వాటిని దూరం పెడతారా అనే ఒక భయాందోళన ప్రజల్లో కలుగుతుంది.

కాబట్టి “ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేలుతలపెట్టవోయి” అని గురజాడ అప్పారావు అన్నట్లు, ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి నిజంగానే మీకు గతంలో తప్పులు జరిగాయి అనిపిస్తే విచారణ జరపండి, తప్పనిసరిగా చట్టబద్దంగా చర్యలు తీసుకోండి. దానికి ఒక ప్రతిపక్షపార్టీగా మేము అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాం. కానీ ప్రజా సమయాన్ని దుర్వినియోగం చేయకండి, అభివృద్ధి ప్రస్థానాన్ని ఆపకండి. ఇప్పటికే ధరణిని ఆపేశారు, రాయదుర్గం – విమానాశ్రయం మెట్రోను ఆపేస్తాం అని చెప్పారు, మనం కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణదశలో ఉన్న ఫార్మాసిటీను స్క్రాప్ చేస్తాం అని చెప్పారు. పైగా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు ఢిల్లీలో తెలంగాణ భవన్ బిల్డింగులు కడదాం అని చూస్తున్నారు, హైకోర్టు బిల్డింగ్ కడదాం అని ప్రణాళికలు వేస్తున్నారు తప్ప ప్రజలకు, నిరుద్యోగులకు మౌళికంగా ఉపయోగపడాల్సిన వాటిపైన రివ్యూలు చేయడంలేదు. అంతే కాదు ఎన్నికల సందర్భంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మరియు స్వయానా మీరు కూడా అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి Rs 4000 చొప్పున అందజేస్తాము అని వాగ్దానం చేసి, నిన్న అసెంబ్లీ సాక్షిగా అసలు నిరుద్యోగ భృతి ఇస్తామని మేము వాగ్దానమే చేయలేదు అని గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు చెప్పడం బట్టి చూస్తే వాగ్దానాల నుండి మీ దాటవేత ధోరణి కనపడతా ఉంది.దయచేసి మీ వాగ్దానాలకు అనుగుణంగా మీ పరిపాలన ప్రాధాన్యతలను మార్చుకోండి.

బీఆర్ఎస్ హయాంలో FRBM పరిధిలోనే లోన్లు తీసుకున్నారు. భారతదేశంలో ఉన్న అనేక బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే మన తెలంగాణ ఫిస్కల్ డెఫిసిట్ శాతం తక్కువగా ఉంది. అందులోను మనది వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. డెఫిసిట్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ లో ఏ రాష్ట్రమైనా లేదా ఏ దేశం అయినా పెట్టుబడులకోసం త్వరితగతి అభివృధ్ధికోసం అప్పులు చేయడం నేరం కాదు. తద్వారా జరిగిన లాభం ఏమిటి అనేది ముఖ్యం. చైనా, అమెరికా లాంటి ప్రోగ్రెసివ్ దేశాలు కూడా అప్పులు లేకుండా అభివృద్ధి సాధించిన దాఖలాలు లేవు.

2014 తరువాత తెలంగాణకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని ఆలోచించాలి? రాష్ట్రం ఏర్పడే సమయానికి మనకి తాగడానికి నీళ్లు, సాగునీరు, కరెంటు , రోడ్లు, సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సదుపాయాలు లేకుండా అరవై రెండువేల కోట్ల అప్పుతో మన చేతుల్లో పెట్టారు. తెలంగాణ అభివృద్ధికి నోచుకోకుండా ఆర్ధికంగా కుదేలై ఆగమాగంలో ఉన్న పరిస్థితి.

2014 సంవత్సరంలో రాష్ట్ర బడ్జెట్ Rs 1,00,637 ఉంటే 2023 సంవత్సరం వచ్చేటప్పటికి రాష్ట్ర బడ్జెట్ రెండు కోట్ల 77 లక్షల 690 కోట్ల రూపాయల వరకు పెరిగింది. సాగు వినియోగంలో ఉన్న భూమి 2014లో ఒక కోటి 31 లక్షల ఎకరాలు మాత్రమే ఉంటే ఇవాళ అది కాస్త రెండు కోట్ల 20 లక్షల ఎకరాలకు పెరిగింది. వరి పంట కేవలం 68 లక్షల టన్నులు మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి నుండి, ఈరోజు అది రెండు కోట్ల డెబ్బై లక్షల టన్నుల వరకు పెరిగింది. తాగునీటి సౌకర్యం కేవలం 27% నివాసాలకు మాత్రమే అందుబాటులో ఉంటే, ఈరోజు 100% ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై ఉన్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రిసిటీ విద్యుత్ ఉత్పత్తి 778 మెగావాట్ల నుండి ఇవాళ 16,506 మెగావాట్ల సామర్థ్యానికి పెంచుకున్నాం. పెర్ క్యాపిటా విద్యుత్ వినియోగం 1100 యూనిట్లు మాత్రమే ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, ఇవాళ 2012 యూనిట్ల వరకు పెంచుకొని ప్రగతి పథంలో తెలంగాణను నిలుపుకున్న ఉన్నఅనేకవిషయాలనుపక్కనపెట్టి కేవలం అప్పుల గురించి మాట్లాడి ఆస్తులను అభివృద్ధిని విస్మరించి బట్ట కాల్చి మీద వేసి రాజకీయాలకు మీరు చరమగీతం పాడాలని విజ్ఞప్తి.

అప్పులు చేయకుండా పెళ్లి చేసినోడు లేడు, ఇల్లు కట్టినోడు లేడు. ఇక రాష్ట్రాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంచిన వాళ్ళు దేశంలో ఎక్కడా లేరు. జాతీయ స్థాయిలో 160 లక్షల కోట్ల రూపాయల అప్పు అయితే పంజాబ్, బిహార్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కేరళ, హర్యానా తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, మధ్యప్రదేశ్ మరియు ఇంకా అనేక రాష్ట్రాలు మనకంటే ఎక్కువ అప్పులు తీసుకున్నారు.. ఇవాళ తెలంగాణా అప్పు ఆరు లక్షల కోట్ల రూపాయలు కావచ్చు. కానీ మిగతా అన్ని రాష్ట్రాలకంటే మనం సంక్షేమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మనం నెంబర్ వన్ స్థానంలో ఉన్నాము. మీరు అప్పుల గురించి మాట్లాడినప్పుడు, అదే సమయంలో ఆస్తుల సంగతి కూడా చెప్పాలి కదా. కేసీఆర్ హయాంలో ప్రభుత్వ ఆస్తుల పెంపకమే కాదు ప్రైవేట్ ఆస్తుల పెంపుదల కూడా చేసాడు, ఒకప్పుడు అర ఎకరం, ఎకరం భూములు ఉన్న పేద రైతుల భూములు కూడా ఇవాళ లక్షల రూపాయల ధర పలుకుతూ, కోటీశ్వరులు అయ్యారు. ధరణి తో వచ్చిన భూ భద్రత వల్ల, తగు నీరు, సాగు నీరు రావడంతో భూముల ధరలు పెరిగాయి, స్టేబుల్ మరియు సింగల్ విండో ఇండస్ట్రీ పాలసీలు వల్ల ఇండస్ట్రీలు పెరిగాయి. ఇలా వ్యక్తుల, సంస్థల, వ్యవస్థల ఆస్తుల విలువలు పెరిగాయి. ప్రజలు మీ హామీల అమలుకోసం ఆబగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణం కోసం, రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల అభివృధ్ధికోసం మీ ప్రణాళికలు ఏమిటో శ్వేత పత్రం విడుదల చేయాలని తెలంగాణ పౌరుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను.

ఇట్లు

డాదాసోజు శ్రవణ్