BRS : ఢిల్లీలో ఏఐసీసీ నూతన కార్యాలయాన్ని ఆ పార్టీ అగ్రనేతలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ సొంత కార్యాలయం నిర్మించుకునేందుకు ఇన్నేళ్లు పట్టిందని తెలిపారు. నిన్న గాక మొన్న వచ్చిన ప్రాంతీయ పార్టీలు, 40 ఏళ్ల సీనియారిటీ మాత్రమే ఉన్న బీజేపీ స్వల్పకాలంలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాయన్నారు. తమ పార్టీ ప్రజల కోసం ఎంత నిస్వార్ధంగా పనిచేస్తుందో దీనిని బట్టి అర్థం చేసుకోవాలన్నారు.
బీర్ఆర్ఎస్ పార్టీ బీ-ఆర్ఎస్ఎస్ గా మారిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వైఖరి బీజేపీ వైఖరి తెలంగాణలో ఒకే రకంగా ఉన్నదని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో వెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్టోందని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్‌పై బీజేపీ ఏ ఆరోపణలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అవే ఆరోపణలు చేస్తుందని.. టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో చట్టబద్ధమైన పాలన కొనసాగుతుందని తెలిపారు.
దేశ భవిష్యత్తు కోసం ఇకపై ఈ కార్యాలయం వేదికగా ప్రణాళికలు రచించబోతున్నామని జోస్యం చెప్పారు. ప్రపంచంలోనే మేటి దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దేందుకు విధి విధానాలు రూపొందిస్తామన్నారు. దేశ ప్రజలకు ఇది పండగ రోజు అని ఆయన అభివర్ణించారు. రాబోయే రోజుల్లో పేద ప్రజలందరికీ ఇక్కడి నుంచే దశ దిశ నిర్ధారిస్తామని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ ఈ రోజు అద్భుతమైన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుందని తెలిపారు. దేశ ప్రజల ప్రయోజనానికి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఒక వేదిక కాబోతుందన్నారు.