Vinod Kumar: ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి, ఎకరాకు పది వేల పరిహారం ఇవ్వాలి

  • Written By:
  • Publish Date - March 19, 2024 / 11:35 PM IST

Vinod Kumar: వడగళ్ల వర్షం కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు పది వేల పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు పోతుగల్, సేవాలాల్ తండా, గన్నేవానిపల్లి,తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ గ్రామాల్లో వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించిన అనంతరం సిరిసిల్ల పట్టణంలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు.

అంతకు ముందు ముస్తాబాద్ మండల కేంద్రంలో నిన్న వడగళ్ల వర్షం కారణంగా చెట్టు,విద్యుత్ స్తంభం విరిగి పడిన సంఘటనలో మృతి చెందిన ఎల్సాని ఎల్లయ్య కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ₹10లక్షల సాయం అందించడంతో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మృతుడికి రైతు భీమా చేయడం జరిగిందని, ₹5లక్షల రైతుభీమా సొమ్మును వెంటనే రైతు కుటుంబానికి వచ్చే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ కు పోన్ చేసి తెలపడం జరిగింది.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి వేలాది రూపాయలు ఖర్చు పెట్టి పంటలు సాగు చేశారని…వడగళ్ల వానతో రెక్కల కష్టం నేలపాలవ్వడంతో రైతులు కన్నీరు పెడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు తక్షణమే ₹10వేల చొప్పున పంట నష్ట పరిహారం అందించాలని కోరారు. వడగళ్ల వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను తక్షణమే సర్వే చేయించి పంట నష్టం అంచనా వేయించి రైతులకు నష్ట పరిహారం అందే విదంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి కోరారు. పంట పొలాలకు కాల్వల్లో మోటార్లు వేసుకుని నీళ్లు పారించుకున్న గన్నేవానిపల్లి రైతులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలను కోరారు.