Singireddy: రుణమాఫీ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ డేటాను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిర్ణయంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రైతులకు సాయంపై రంధ్రన్వేషణ చేస్తారా ! అని ప్రశ్నించారు. రుణమాఫీ అందరికీ వర్తింప చేయాలి ప్రభుత్వ ఆంక్షలు గర్హనీయమని ఆయన అన్నారు.
‘‘రైతులు ఎవరైనా రైతులే .. ఎన్నికల హామీ ప్రకారం రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేయాలి. ఏడు నెలలు దాటినా ఇంకా కట్ ఆఫ్ డేట్ కూడా నిర్ణయించకపోవడం ఈ ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యానికి నిదర్శనం .దేశంలో తొలిసారి కేసీఆర్ రైతుబంధు పథకం అమలు చేయడంతో కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి పెరిగి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. అదీ ఏడాదికి ఈ పథకం కింద మూడు విడతలలో ఇచ్చేది మొత్తంగా రూ.6 వేలు మాత్రమే .. దాని అమలుకు కూడా కేంద్రం సవాలక్ష ఆంక్షలు విధించింది.’’ మాజీ మంత్రి అన్నారు.
‘‘తెలంగాణలో 70 లక్షల మందికి పైగా రైతులు ఉండగా కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ నిధి గరిష్టంగా 36.1 లక్షల మంది రైతులకే అమలు చేశారు. కేంద్రం విధించిన అనేక నిబంధనల మూలంగా ప్రస్తుతం రాష్ట్రంలో కిసాన్ సమ్మాన్ నిధి రైతుల సంఖ్య 29 లక్షల 78 వేల 394 మంది కాగా ఇందులో 29 లక్షల 50 వేల 888 మంది ఖాతాలలో ఈ విడతలో నగదు జమయింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 70 లక్షల మంది రైతులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎకరాకు రూ.5 వేలు, ఏడాదికి ఎకరాకు రూ.10 వేలు రైతుబంధు పథకాన్ని వర్తింపచేశారు’’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.