NYC Firing: న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు దొరికాడు.. ఆ తుపాకీతోనే…!

అమెరికాలోని న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. 62 ఏళ్ల ఫ్రాంక్ జేమ్స్ ను ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు.

  • Written By:
  • Publish Date - April 14, 2022 / 10:31 AM IST

అమెరికాలోని న్యూయార్క్ కాల్పుల ఘటనలో నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. 62 ఏళ్ల ఫ్రాంక్ జేమ్స్ ను ఫెడరల్ లా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. కాకపోతే జేమ్స్ ను గుర్తించడానికి వీలుగా అతడి ఫోటోలను విడుదల చేశారు. దీంతో సోషల్ మీడియాలో అవి బాగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలో వ్యక్తిని తాము చూశామంటూ.. కొంతమంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. మొత్తానికి మానహట్టన్ లోని ఈస్ట్ విలేజ్ సమీపంలో ఉన్న అతడిని అధికారులు పట్టుకోగలిగారు.

బ్రూక్లిన్ అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ లో పొగబాంబు పేల్చడం, కాల్పుల జరిగిన ఘటనలో జేమ్స్ నిందితుడు. నిజానికి ఆ సంఘటన జరిగిన వెంటనే.. అదేమైనా ఉగ్రవాద చర్యా అని అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎందుకంటే టెర్రరిజానికి ఏమాత్రం అవకాశం లేకుండా అగ్రరాజ్యం భారీగా భద్రతా చర్యలు చేపట్టింది. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. ఇలాంటి సమయంలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా ప్రజలు తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

జేమ్స్ నేర చరిత్రను పరిశీలించడానికి వీలుగా అతడి సోషల్ మీడియా పోస్టులను పోలీసులు చెక్ చేశారు. ఈ దేశంలో హింస పుట్టింది అంటూ జేమ్స్ ఒక వీడియోలో చెప్పినట్టుగా పోలీసులు గుర్తించారు. న్యూయార్క్ లో దాడి జరపడానికి ముందురోజే జేమ్స్ ఒక వీడియోను కూడా పోస్ట్ చేశాడు. అందులో నల్లజాతీయులపై నేరాల విషయంలో విమర్శలు గుప్పించాడు.

ఫ్రాంక్ జేమ్స్ క్రైమ్ హిస్టరీని చెక్ చేస్తే.. 1990 నుంచి 20007 వరకు న్యూయార్క్ తో పాటు న్యూజెర్సీ నగరాల్లో జేమ్స్ పై చాలా కేసులు ఉన్నాయి. వీటిలో భాగంగా అతడిని 12 సార్లు అరెస్ట్ కూడా చేశారు. దొంగతనం, నిబంధనల అతిక్రమణ, నేరపూరిత లైంగికచర్య.. ఇలా వివిధ అంశాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక జేమ్స్.. రూల్స్ ని అతిక్రమించినందుకు గాను.. అతడి యూట్యూబ్ ఖాతాను తొలగించారు. అమెరికాలో చట్టబద్దంగానే తుపాకులు కొనుక్కోవచ్చు. అలా 2011లో జేమ్స్ తుపాకీని కొన్నాడు. కానీ ఈ గన్ లైసెన్స్ వల్ల అమెరికాలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి.