KL Rahul:వందో మ్యాచ్ లో 100

ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.

Published By: HashtagU Telugu Desk
KL Rahul

KL Rahul

ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. అయితే తన ఐపీఎల్‌ కెరీర్‌లో 100 మ్యాచ్‌ ఆడుతున్న కేఎల్‌ రాహుల్‌ ఈ మ్యాచ్‌లో శతకంతో చెలరేగాడు. కేవలం 56 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్.. మొత్తంగా 60 బంతులను ఎదుర్కొని 103 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాహుల్‌ సెంచరీతో చెలరేగడంతో లక్నోసూపర్ జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో ఓపెనర్ల కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌‌కు వీరిద్దరూ కలిసి 52 పరుగులు జోడించారు. ఇందులో క్వింటన్ డికాక్ 13 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 24 పరుగులు చేసి ఆరో ఓవర్‌లో ఎల్‌బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మూడో స్థానంలో వచ్చిన మనీష్ పాండేతో కలిసి కెప్టెన్ రాహుల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు .. 29 బంతుల్లో 6 ఫోర్లు బాదిన మనీష్ 38 పరుగుల వద్ద మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మార్కస్ స్టాయినీస్ 10 పరుగులు చేసి ఉనద్కత్ బౌలింగ్‌లో తక్కువ పరుగులకే అవుటయ్యాడు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ రెండు వికెట్లు తీయగా.. ఫెబియన్ అలెన్, మురుగన్ అశ్విన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Photo Courtesy- BCCI

  Last Updated: 16 Apr 2022, 06:47 PM IST