గత రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవనంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలపై ఈవో ధర్మారెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈసారి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాల్సి వచ్చిందని వివరించారు.
సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నట్లు పేర్కొన్నారు. అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగిస్తాయని వివరించారు. ప్రభుత్వం తరఫున స్వామివారికి సెప్టెంబర్ 27న పట్టు వస్త్రాలు సమర్పణకు ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రిక ఇస్తామన్నారు. మరోవైపు సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నామని ఈవో ధర్మారెడ్డి వివరించారు.