Site icon HashtagU Telugu

Chanda Kochhar : చందాకొచ్చర్‌ కు బెయిల్‌ మంజూరు చేసిన బాంబే హైకోర్టు

Chanda Kochhar

Chanda

ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈఓ చందా కొచ్చర్ (Chanda Kochhar)‌, ఆమె భర్త దీపక్‌ కొచ్చర్‌కు బాంబే హైకోర్టు (Bombay High Court) లో ఊరట.. వీరిని జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా కొచ్చర్‌ దంపతుల అరెస్టు జరగలేదని కోర్టు స్పష్టం చేసింది. వీడియోకాన్‌ (Videocon) గ్రూప్‌ నకు రుణాల మంజూరు వ్యవహారంలో గత డిసెంబరు 23న కొచ్చర్‌ దంపతులను సీబీఐ అరెస్టు.. ప్రస్తుతం వీరు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. అయితే తమను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ వీరు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అంతేగాక, తమ కుమారుడి వివాహం నిశ్చయమైందని, ఇప్పటికే బంధువులందరికీ ఆహ్వానాలు పంపిన నేపథ్యంలో కార్యక్రమం రద్దు చేయడం సరికాదంటూ తమకు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన బాంబే హైకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. కొచ్చర్‌ దంపతుల అరెస్టు చట్ట ప్రకారం జరగలేదని న్యాయస్థానం ఈ సందర్భంగా తెలిపింది. ఈ క్రమంలోనే వారికి బెయిల్‌ మంజూరు చేసిన కోర్టు.. పూచీకత్తు కింద చెరో రూ. లక్ష జమ చేయాలని కొచ్చర్‌ దంపతులను ఆదేశించింది. ఈ కేసులో విచారణకు సహకరించాలని, సీబీఐ సమన్లు జారీ చేసినప్పుడు హాజరు కావాలని వారికి సూచించింది. అంతేగాక, వారి పాస్‌పోర్టులను కూడా సీబీఐకి సమర్పించాలని ఆదేశించింది.

వీడియోకాన్‌ గ్రూప్‌ (Videocon Loan Case) కంపెనీలకు 2012లో మంజూరు చేసిన రుణాల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడినట్లు చందా కొచ్చర్‌ (Chanda Kochhar) దంపతులపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడు బ్యాంకు సీఈఓ హోదాలో ఉన్న రూ.3,250 కోట్ల రుణం మంజూరు చేయగా.. అది ఎన్‌పీఏగా మారడంతో ఆమె కుటుంబం లబ్ధి పొందినట్లు సీబీఐ ఆరోపించింది. వీడియోకాన్‌కు మంజూరు రుణంలో కోట్లాది రూపాయలను దీపక్‌ కొచ్చర్‌ (Deepak Kochhar) నిర్వహించే న్యూపవర్‌లో వీడియోకాన్‌ ప్రమోటర్‌ వేణుగోపాల్‌ ధూత్‌ పెట్టుబడులుగా పెట్టినట్లు పేర్కొంది. ఈ కేసులో చందా కొచ్చర్‌ దంపతులు మోసం, అక్రమాలకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు మోపింది. ఐపీసీ, మనీ లాండరింగ్‌ నియంత్రణ చట్టం నిబంధనల కింద చందా కొచ్చర్‌, దీపక్‌ కొచ్చర్‌తో పాటు వీడియోకాన్‌ గ్రూపునకు చెందిన వేణుగోపాల్‌ ధూత్‌, న్యూపవర్‌ రెన్యూవబుల్స్‌, సుప్రీమ్‌ ఎనర్జీ, వీడియోకాన్‌ ఇంటర్నేషనల్‌ ఎలక్ట్రానిక్స్‌, వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్‌ఐఆర్‌ను సీబీఐ నమోదు చేసింది.

Also Read:  Rishi Sunak : రిషి సునాక్ కు రానున్న సాధారణ ఎన్నికల్లో ఎదురుదెబ్బ..?