Maharastra: మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం.. 22 వేల చెట్లు నరికివేత?

మహారాష్ట్రలో నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాదాపుగా 22 వేల చెట్లను నరికి వేయడానికి బాంబే

  • Written By:
  • Publish Date - December 9, 2022 / 08:05 PM IST

మహారాష్ట్రలో నిర్మించబోతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దాదాపుగా 22 వేల చెట్లను నరికి వేయడానికి బాంబే హైకోర్టు తాజాగా అనుమతినిచ్చింది. ముంబై అహ్మదాబాద్‌ మధ్య నడవున్న బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు కోసం ముంబైతోపాటు పొరుగున్న ఉన్న పాల్ఘర్‌, థానే జిల్లాల్లో విస్తరించి ఉన్న 22 వేల మడ చెట్లను నరికేందుకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌కు అనుమతిస్తున్నట్లు హైకోర్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అభయ్ అహుజాతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేస్తూ షరతులు వర్తిస్తాయని తెలిపింది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ మంజూరు చేసిన అనుమతులలో పేర్కొన్న నిబంధనలు, షరతులకు కట్టుబడి ఉండాల్సి ఉంటుందని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది.

అయితే 50 వేల మడ చెట్లను నరికి వేయడం పై నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ కోరిన అనుమతిని 2018లో కో ఆర్డినేట్‌ బెంచ్‌ తిరస్కరించింది. ప్రజా ప్రయోజన ప్రాజెక్ట్ కోసం నరికివేత అవసరమైతే అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. దీంతో ఎన్‌ఎచ్‌ఆర్‌ఎస్‌సీఎల్‌ బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా ప్రాజెక్ట్ నిర్మాణం కోసం నరికి వేయాల్సిన మడ చెట్ల సంఖ్యలను 50 వేల నుంచి 20 వేలకు వరకు తగ్గించామని ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌ఎస్‌సిఎల్ తరపున న్యాయవాది ప్రహ్లాద్ పరాంజపే కోర్టుకు తెలిపారు.

అంతే కాకుండా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అన్ని అనుమతులు పొందామని దీనికి తోడు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామని హామీ ఇచ్చారు. దీంతో చెట్ల సంఖ్య 53,467 నుండి 22, వేలకు తగ్గిందని తెలిపారు. కాగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై బాంబే ఎన్విరాన్‌మెంటల్ యాక్షన్ గ్రూప్ అనే ఎన్జీవో అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిషేధిత ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది. అలాగే చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయలేదని తెలిపింది.