Site icon HashtagU Telugu

Bomb Attack On Gaza: గాజా ఆసుపత్రి పై బాంబుల దాడి.. జోబైడన్ కు ఇజ్రాయిల్ రక్త స్వాగతం

Bomb Attack On Gaza

Compressjpeg.online 1280x720 Image (1) 11zon

By: డా. ప్రసాదమూర్తి

Bomb Attack On Gaza: అర్ధరాత్రి అక్కడక్కడా మానవ హాహాకారాలు. ఫిరంగుల మోతలు. ఆహారం కోసం, నీటి కోసం, మందుల కోసం చీకటిలో కూడా ఎదురుచూస్తున్న అసహాయ ప్రజలు. ఇది పాలస్తీనా గాజాలో మంగళవారం రాత్రి పరిస్థితి. కానీ అక్టోబర్ 7వ తేదీన చేసిన హమాస్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ పాలస్తీనా మీద చేస్తున్న కౄర యుద్ధం మొదలై ఇప్పటికే 10 రోజులు దాటింది. ఇజ్రాయిల్ని దాడులు ఆపమని, మానవీయ ప్రపంచం వేడుకుంటోంది. అయినా నెతన్యాహు నెత్తుటి దాహానికి అంతులేదు. గాజా నుంచి ప్రజలు మొత్తాన్ని ఖాళీ చేయించాలని ఈ నియంత ఉరకలు వేస్తున్నాడు. ఎంత ఆటవికంగా అమానుషంగా దాడులు చేసినా, ఆసుపత్రులను, స్కూళ్లను ఈ యుద్ధం నుండి మినహాయిస్తారని అందరూ భావించారు. కానీ యుద్ధంలో నీతి నియమాలు ఉంటాయేమో, యుద్ధోన్మాదంలో ఏ నీతీ ఉండదని నెతన్యాహు నిరూపించాడు. సెంట్రల్ గజాలోని ఆల్ ఆహ్లి ఆసుపత్రి పై మంగళవారం రాత్రికి రాత్రే బాంబుల (Bomb Attack On Gaza) వర్షం కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది ప్రకారం ఈ దాడిలో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రులు అంటే అక్కడ చిన్న పిల్లలుంటారు, వృద్దులుంటారు, మహిళలుంటారు. అందరూ ఏదో అనారోగ్యంతో అక్కడ చికిత్స పొందుతూ ఉంటారు. ఇంటికి వెళ్లలేని వారే ఆసుపత్రుల్లో అడ్మిట్ అవుతారు. అంటే ఆసుపత్రులలో ఉంటున్న వాళ్ళు అమాయకులు, అసహాయులు, ఏ పాపం ఎరుగని వాళ్లే అని తెలియని అమాయకులు మాత్రం ఎవరూ ఉండరు. అలాంటి ఆసుపత్రి మీద దాడి చేయడం ఏమంత నీతి అనిపించుకుంటుందో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇప్పుడు ప్రపంచానికి చెప్పాలి. ఆసుపత్రిలో సర్జరీ గదులు కూడా పూర్తిగా ధ్వంసం అయినట్టు వార్తలు వస్తున్నాయి. మొదట్లో హమాస్ చేసిన దాడిని ఖండించిన దేశాలు కూడా ఇప్పుడు ఇజ్రాయిల్ సాగిస్తున్న ఈ మానవ మారణ హోమాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్నాయి. వెంటనే ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ పరిస్థితి మీద చర్చించాలని, ఈ యుద్ధాన్ని నిలువరించి మరింత మారణ హోమం జరగకుండా ఆపాలని, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ డిమాండ్ చేశాయి.

Also Read: Shock To Biden : బైడెన్ కు షాకిచ్చిన జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా

We’re now on WhatsApp. Click to Join.

కానీ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు, ఆ దేశ అధ్యక్షుడు అందరూ కలిసి చెబుతున్నది ఏమిటంటే, గాజాలో ఎవరూ నిర్దోషులు లేరట. అక్కడ ఉన్నది అందరూ ఉగ్రవాదులేనట. కాబట్టి వాళ్ళని చంపితే తప్పు లేదట. ఇదీ ఇజ్రాయిల్ ఇప్పుడు ప్రదర్శిస్తున్న యుద్ద నీతి. ఎంత దారుణం.. ఎంత దుర్మార్గం.. ప్రపంచం చూస్తుండగానే ఎంత పచ్చి మానవ ద్వేషాన్ని ఎలా వెళ్ళగక్కుతున్నారో అందరూ ఏమీ అర్థం కాక నివ్వెరపోతున్నారు. అంటే కడుపులో ఉన్న బిడ్డతో సహా, పాలు తాగుతున్న పిల్లలతో సహా, నడవలేని వృద్ధులతో సహా, ఇల్లూ వంటిల్లు దాటి బయటకు రాని మహిళలతో సహా, బడుల్లో తలలు వొంచి పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలతో సహా అందరూ దోషులేనా? ఈ ప్రశ్న ఇప్పుడు ప్రపంచం నెతన్యాహుని అడుగుతుంది.

ఈరోజు అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఇజ్రాయిల్ వెళ్లి అక్కడ నెతాన్యాహుతో సమావేశమై, అటు నుంచి జోర్డాన్ వెళ్లి అక్కడ జోర్డాన్ నేతలతో పాటు పాలస్తీనా అథారిటీ నేతలతో కూడా సమావేశం అవుతారు. మరి జోబైడన్ రాకకు ఇజ్రాయిల్ ఇలా ఒక నెత్తుటి స్వాగతాన్ని పలికిందా? ఇప్పటికే అమెరికా ఇజ్రాయిల్ కి చాలా గట్టి సానుభూతిని ప్రకటిస్తూ, దొడ్డదారినో.. దొడ్డిదారినో యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు, మానవ మారణ సామాగ్రిని సరఫరా చేస్తోంది. ఆసుపత్రి మీద ఇజ్రాయిల్ చేసిన ఈ దాడి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడుతో సమావేశాన్ని జోర్డాన్ రద్దు చేసినట్టు ప్రకటించింది. మరి జో బైడన్ ఇజ్రాయిల్ వెళతారో లేదో చూడాలి. వెళ్లినా, ఇజ్రాయిల్ చేస్తున్న ఈ నరమేధాన్ని ఆపమని ఆదేశిస్తారా.. కాదు పాలస్తీనాలో నివసిస్తున్నది మనుషులు కాదు ఉగ్రవాదులేనని, పాలస్తీనా మొత్తాన్ని స్మశానంగా మార్చమని ఇజ్రాయిల్ ను ప్రోత్సహిస్తారా.. చూడాలి. ఏది ఏమైనా మానవజాతి చరిత్రలో ఇజ్రాయిల్ చేసిన ఈ ఘాతుకం రక్తాక్షరాలలో ఎప్పటికీ రగులుతూనే ఉంటుంది. యుద్ధకాంక్ష చంపుకోమని, శాంతి వైపు పయనించమని ఈ మారణకాండ ప్రపంచానికి హెచ్చరిస్తూనే ఉంటుంది.