India: పంజాబ్ కోర్టులో భారీ బ్లాస్ట్

  • Written By:
  • Updated On - December 23, 2021 / 03:18 PM IST

పంజాబ్ లోని లుధియానా కోర్టులో భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. కోర్టు కాంప్లెక్స్ లోని మూడవ అంతస్థులో ఈ పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతున్నారు. బ్లాస్ట్ బాత్రూం లో చోటు చేసుకోగా పేలుడు తీవ్రతకు గోడలు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల విచారణ నేపథ్యంలో బ్లాస్టుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. గురువారం మధ్యాహ్నం 12:22 గంటలకు బ్లాస్ట్ చోటు చేసుకున్నట్టు సమాచారం.

ఈ ఘటనపై పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వంటనే స్పందింస్తూ… తాను లూథియానా వెళుతున్నానని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జాతి విద్రోహ శక్తులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం అప్రమత్తంగానే ఉందని, పేలుళ్లకు బాధ్యులైన వారిని విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.

ఘటన జరిగిన వెంటనే లూథియానా పోలీస్ కమిషనర్ గుర్ ప్రీత్ భుల్లార్ స్పందించారు. లూథియానా కోర్టు కాంప్లెక్స్ లోని రెండో ఫ్లోర్ లో రికార్డు రూమ్ కు సమీపంలో పేలుడు జరిగిందని, చండీగఢ్ నుంచి బాంబు డిస్పోజల్ స్క్వాడ్, ఫోరెన్సిక్ నిపుణుల బృందాన్ని వెంటనే అక్కడికి తరలించామని వెల్లడించారు. భయాందోళనలకు గురి కావాల్సిన పనిలేదని, దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీస్తామని అన్నారు.