Site icon HashtagU Telugu

Modi Strategy: తెలంగాణపై ‘మోడీ’ ఫోకస్!

Modi1

Modi1

తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ నాయకత్వం ఫోకస్ చేయనుందా? వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా మోడీ, షా ద్వయం పావులు కదుపనున్నారా? అంటే అవుననే అంటున్నారు బీజపీ నాయకులు. గతంలో ఎప్పుడులేనివిధంగా ప్రధాని మోదీ హైదరాబాద్ బీజేపీ కార్పొరేట్లను ఢిల్లీకి పిలిపించుకోవడం అంతటా చర్చనీయాంశమవుతోంది. పేరుకే సాధారణ సమావేశం అయినా.. భేటీ వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని భావించక తప్పదు. ఒకవైపు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై గురి పెడితే.. మరోవైపు మోడీ, షా లు తెలంగాణ ఫోకస్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. కేసీఆర్ పై వీస్తున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని, అధికారం కోసం ప్రతిఒక్కరూ పనిచేయాలని మోడీ దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది.

ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన బీజేపీ కార్పొరేటర్లతో మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. తెలంగాణలో సుపరిపాలన, కుటుంబ పాలనకు స్వస్తి పలికేందుకు బీజేపీ కృషి చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఉపఎన్నికలు, హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయాలు సాధించడంతో అధినాయకత్వం దక్షిణాధిపై ఫోకస్ చేస్తోంది. ప్రధాని మోడీతో సమావేశమైన కార్పొరేటర్లతో పాటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,  తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కూడా ఉన్నారు.

“GHMCలోని @BJP4Telangana కార్పొరేటర్లు, తెలంగాణకు చెందిన ఇతర పార్టీ నాయకులను కలిశాను. కమ్యూనిటీ సేవలపై దృష్టి పెట్టడం, అట్టడుగు స్థాయి ప్రజలకు ఎలా సహాయపడాలనే దానిపై మేం విస్తృత చర్చలు జరిపాం. తెలంగాణలో సుపరిపాలన, కుటుంబ పాలనకు ముగింపు పలికేందుకు బీజేపీ కృషి చేస్తుంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రంలోని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్)కి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమికి మద్దతునిచ్చే పనిలో ఉన్నారు. దక్షిణ భారతదేశంలో బిజెపి ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తెలంగాణతో ఎలాగైనా సౌత్ లో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది. ఇక వచ్చే నెలలో హైదరాబాద్‌లో కాషాయ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం కూడా జరగనుంది. ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.